విశి:
కుట్టి రేవతి తమిళ కవయిత్రి & సినీ గీతరచయిత్రి. అసలు పేరు రేవతి స్వయంభులింగం. తమిళ భాషలో తొలి స్త్రీవాద పత్రిక ‘పణిక్కుడం(ఉమ్మనీటి సంచి)’కి ఆమె సంపాదకురాలు. అనేక కవితలు, కథలు రాశారు. 2000లో తొలి కవితా సంపుటి ‘పూనయై పోల అలయుం వెలిచ్చం(పిల్లిలా తిరుగుతున్న వెలుగు)’ వెలువరించారు. 2002లో విడుదలైన రెండో పుస్తకం ‘ములైగల్(రొమ్ములు)’ వివాదాస్పదమైంది. ఆ పుస్తకాన్ని నిషేధించాలని అనేకమంది మగ రచయితలు డిమాండ్ చేశారు. కవిత్వంలో స్త్రీ లైంగికత, రొమ్ములు, యోని వంటివి రాయడం తప్పంటూ ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. 2003లో మూడో కవితా సంపుటి ‘తనిమయిన్ ఆయిరం ఇరక్కైగల్’ వెలువరించారు. ఆమె కవితలు ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.
2013లో ధనుష్ నటించిన ‘మరియాన్’ సినిమాకు సహాయ దర్శకురాలిగా ఉన్న ఆమె ఆ సినిమాలో రెండు పాటలు రాసి తమిళ సినిమా రంగంలో గీత రచయిత్రిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘ఎన్నమో నడక్కుదు’, ‘అరువి’, ‘వాళ్’ తదితర సినిమాల్లో పాటలు రాశారు. ‘అరువి’ ఆమెకు విశేషమైన పేరు తెచ్చింది. ఆమె కొన్ని డాక్యుమెంటరీలూ తెరకెక్కించారు. పలు ఇంటర్య్వూల్లో ఆమె చెప్పిన విషయాలు ఇవి..)
* భారతదేశ తొలి ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫులె ఆడపిల్లలకు పాఠాలు చెప్పడానికి బడికి వెళ్తుంటే ఆమెపై పేడ వేసేవారు. ఆమె భయపడి ఆగిపోయిందా? సంచిలో మరో చీర పెట్టుకుని బడికి వెళ్లి, మురికిగా మారిన చీరను మార్చి మరో చీర కట్టుకుని పాఠాలు చెప్పేవారు. అదీ పట్టుదల, దీక్ష. దాంతో పోలిస్తే ఇవాళ మన మీద జరిగే దాడులు, వేసే నిందలు పెద్దవా?
* Personal is always Political. ఏదైనా ఒక అంశం మిమ్మల్ని వ్యక్తిగతంగా తాకితే అది అక్కడే అంతమైపోదు. అలా అంతమైపోయేది కళ కాదు. కవిత్వం కూడా వ్యక్తిగత స్థితి నుంచి సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతుంది. అలా ఎదగలేనప్పుడు ఆ కవిత్వం జనాల ముందుకు తేవడం ఎందుకు? మన డైరీలో రాసుకుంటే సరిపోతుంది కదా!
* దర్శకుడు వెట్రిమారన్ ఒక మాటంటారు – “సినిమాలోని Vulnerabilitiesని మనం బయటికి చూపించామంటే, సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లలో సగానికి సగం తగ్గిపోతాయని”. సినిమాలో ఎవరికీ అర్థం కాని బోలెడన్ని విషయాలు ఉంటాయి. రచన దానికి పూర్తి భిన్నమైన విషయం. స్క్రిప్టుగా ఉన్న సినిమాని తెరపైకి తీసుకురావాలంటే ఒక్కోసారి రక్తం చిందించాల్సినంత పనవుతుంది.
* ‘అరువి’ సినిమా నాకు చాలా పేరు తెచ్చింది. అందులో నేను రాసిన మూడు పాటలు ఉంటాయి. కానీ ఆ సినిమా కోసం నేను మొత్తం 30 పాటల దాకా రాశాను. తమిళ సాహిత్యంలో సంగమ కాలం నుంచి ఇప్పటిదాకా భాష అనేక విధాలుగా మార్పు చెందుతూ వస్తోంది. ఎన్నో రకాల కవితా రీతులు, భాషా వ్యత్యాసాలు ఉన్నాయి. వాటి గురించి అవగాహన కలిగిన వ్యక్తి ఆ సినిమా దర్శకుడు అరుణ్ ప్రభు. పాటల్లో తనకు ఎలాంటి భావాలు, భాష కావాలో స్పష్టంగా చెప్పి పాటలు రాయించుకున్నారు. అందుకే అవి అందరికీ చేరువయ్యాయి.
* వర్జీనియా వూల్ఫ్ ఒక మాటంటారు – “రాయాలని అనుకుంటున్నావా? అయితే రాతలో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకో” అని. స్త్రీకి రాత ఒక ఆయుధం. దానికి ఎవరి అనుమతి అవసరం లేదు. అది ఒక హక్కు. Being a poet is a very powerful thing in this Nation.
* కులాల సమస్య చర్చించకుండా స్త్రీవాదం గురించి ఎలా మాట్లాడతాం? ఇక్కడ జాతి సమస్య, మతాల సమస్య ఉందని తెలిసీ, దాన్ని పక్కన పెట్టి, ఆడవాళ్లకు విద్య, ఉద్యోగం, సమానావకాశాలు ఇస్తే సరిపోదు. అది సమస్యను పైపైన చూసినట్టే అవుతుంది. అంబేడ్కర్, పెరియార్, ఫూలే లాంటి వారు ఏళ్లకేళ్లు పోరాడింది ఆ కుల నిర్మూలన జరగాలనే కదా!
* స్త్రీల సమస్య ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. ఒక చోట మతంతో ఇబ్బంది, మరో చోట ప్రభుత్వంతో ఇబ్బంది, ఇంకోచోట మతాచారాలతో ఇబ్బంది.. మన దేశంలో స్త్రీలకు మరికొన్ని ఇబ్బందులున్నాయి. వాటి గురించి మాట్లాడేటప్పుడు కులం & మతం తాలూకు సమస్యలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. లేకపోతే అది వృథా వాదన అవుతుంది.
* నేను చాలా ప్రయాణాలు చేశాకే పుస్తకాలు రాశాను. అలాగే చాలా పుస్తకాలు చదివాకే ప్రయాణాలు చేశాను. నా జీవితంలో సాహిత్యం, ప్రయాణం ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. ఎప్పుడూ ఒకేచోట ఉండే చెట్టులా ఉండటం అంత మంచిది కాదు. అది మనల్ని చాలా విషయాల్లో పరిమితం చేస్తుంది. మనల్ని మనం విస్తరించుకున్నప్పుడే మనం ఎదుగుతాం. ఎంత మేరకు విస్తరించగలమో, అంత దూరందాకా ప్రయాణించి కొత్త విషయాలు తెలుసుకోవడం మనుషులకు అత్యవసరం.
* సమాజం చాలా చిక్కుముడులతో తయారై ఉంటుంది. దాని గురించి మనల్ని ఎవరూ హెచ్చరించరు. మనకు మనమే దాని గురించి తెలుసుకోవాలి. అలాంటి సందర్భాల్లో రచయిత ప్రమీల్(1939-1997) గారి రచనలు నాకు సమాజాన్ని పరిచయం చేశాయి. రచయితల మనసులో ఏముంది, రచనలు కూడా కుల, మత ప్రాతిపదికన ఎలా వస్తున్నాయి, సమాజంలో ఎలా మెలగాలి అనే విషయాలను ఆయన తన రచనల్లో చాలా బాగా వివరించారు.
* కవిత్వం రాయడం, సినిమాకు పాటలు రాయడం అనేవి రెండూ వేర్వేరు విషయాలు. కవిత్వంలో మనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మనకు నచ్చిన భాషను ఎంచుకునే అవకాశం ఉంటుంది. సినిమాలో అలా కుదరదు. పాత్రకు ఏం భాష వాడాలి, ఆ సందర్భంలో ఎలాంటి మాటలు రాయాలి, ట్యూన్ ఎలా ఉంది.. ఇవన్నీ ఆలోచించి పాట రాయాల్సి ఉంటుంది. అయితే పాటలు బాగా రాయాలంటే భాష బాగా తెలియాలి. అందుకోసం కవిత్వంపై పట్టు ఉండాలి.
* ఎవరెన్ని మాట్లాడినా మన దేశం కులం పునాదులపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికీ బాగా చదువుకుని, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కులం అనే ఆలోచన నుంచి బయటకు రాలేక పోతున్నారు. దాని వల్ల సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. దీనికి ప్రేమే పరిష్కారం. ఒకరినొకరు ప్రేమగా స్వీకరించడమే మార్గం. నేను ఎప్పుడూ ప్రేమ పక్కనే ఉంటాను. మనం ఎప్పుడూ ప్రేమ పక్కనే ఉండాలి.
* జపాన్ వాళ్లని చూడండి! వాళ్లు తమ భాషను చాలా గౌరవిస్తారు. ఆ దేశంలో ఉద్యోగం చేయాలంటే తప్పకుండా ఆ భాష వచ్చి తీరాలి. అంతలా వారు తమ భాషని శక్తివంతం చేశారు. మనం మన దేశంలో అలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు. మన భాష ఇదీ, దాని చరిత్ర ఇదీ అని చెప్పేందుకు ఎందుకు సిగ్గు పడుతున్నాం?