మా అసోసియేషన్ ఎన్నికల తేదీ ఖరారు!

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్ష ఎన్నికలకు తేదీ ఖరారైంది. సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ‘మా’ అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుతో ‘మా’ అధ్యక్ష కార్యదర్శులు.. పలువురు కార్యవర్గ సభ్యులు భేటీ అయ్యారు.
‘మా’ అసోసియేషన్​లో ఇటీవలే జరిగిన పరిణామాలను కార్య వర్గ సభ్యులు కృష్ణం రాజు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక వారు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుత కార్యవర్గ పదవీకాలం ముగియడం వల్ల సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోవాలని కోరారు. ఆగస్టు 22న సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. సెప్టెంబర్ 12న అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
ఇక రెండేళ్లకోసారి జరిగే మా ఎన్నికల్లో ఈసారి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ తోపాటు యువ కథానాయుడు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ , హేమ, సీవీఎల్ నర్సింహరావుతో పాటు పలువురు పోటీలో ఉన్నారు.