Smartphone: నిద్రలేచిన మొదలు..పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. వినోదానికి, కాలక్షేపానికి, వ్యాపార లావాదేవీలతో పాటు ప్రతి అంశానికి సంబంధించి.. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి వేళ్లు టచ్ స్క్రీన్ పై ఉంటున్నాయి. సాంకేతికంగా దగ్గర చేస్తూనే.. సైబర్ వ్యసనానికి బానిసగా మార్చేస్తోంది. వైవాహిక జీవితాల్లో కలహాలు..చిన్నారులు, యువత పై తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు సర్వే సంస్థలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సైబర్ వ్యసనం నుంచి విముక్తి కలిగించడంపై పిల్లల తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ పిల్లల్లో సైబర్ వ్యసనానికి సంబంధించి మెట్రో నగరాల్లో 1000 మంది తల్లిదండ్రులను కలిసి సర్వే నిర్వహించింది. దాదాపు 60 శాతం మంది పిల్లలు డిజిటల్ ఎడిక్షన్ తో బాధపడుతున్నట్లు.. తద్వారా నిద్రలేకపోవడం ,చదువులో వెనుకబడటం వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది.
సైబర్ వ్యసనం మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భార్య, భర్తల మధ్య అంతరం పెరిగిపోతోంది. అనైతిక చర్యల(అక్రమ సంబంధాలు వంటి) మూలానా పచ్చని సంసారాలు కూలిపోతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తద్వారా దంపతులు వీలైనంత వరకు ఒకరితో మరొకరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలని..ఎలాంటి దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని పంచుకోవాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.
ఇక సైబర్ వాడకం యువత పై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెడు అలవాట్లకు బానిసగా మార్చేస్తోంది. చాలా మంది యువత డ్రగ్స్,గంజాయికి బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచి..సైబర్ వ్యసనం నుంచి విముక్తి కల్పించేలా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.