ఎమ్మెల్సీ కవిత సంచలనం: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే..!!

హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.తాజాగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కవిత సమర్థించడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పూర్తిగా చట్టబద్ధమైనదే. 2018లో చేసిన చట్టసవరణ ఆధారంగా ఇది తీసుకొచ్చారు. న్యాయపరంగా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే నేను ఆర్డినెన్స్‌కు మద్దతు ప్రకటించాను” అని కవిత తెలిపారు.

ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఆమె తప్పుపట్టారు. “బీఆర్‌ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరైనది కాదు. బీసీ రిజర్వేషన్ల అంశంలో వారు నా దారితీరు అనుసరించాల్సిందే. అయినా నాలుగు రోజులు టైం తీసుకుని వచ్చేస్తారు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

తాజాగా తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించిన కవిత, “ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీ నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయంలో వారివారి విజ్ఞతకే వదిలేస్తున్నా” అని పేర్కొన్నారు.

మొత్తంగా కవిత వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో
చర్చనీయాంశం అయ్యాయి. ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను సమర్థిస్తున్న ఎమ్మెల్సీ కవిత అభిప్రాయాలు రాజకీయంగా కొత్త దిశను సూచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Optimized by Optimole