పింఛన్ లబ్ధిదారులకు దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయాలని కోరారు. అవసరమైతే తాను సైతం లేఖ రాస్తానని స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని రఘురామ విమర్శించారు. సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం… వాలంటీర్ తానే ఆ తప్పు చేశానని అంగీకరించడంతో కేసును మూసి వేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. వైసీపీ నేతలను ప్రజలంతా దొంగలుగా భావిస్తున్నారన్న ఆయన.. పార్టీ పెద్దలకు అప్రతిష్టపాలు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల డీజీపీగా పదోన్నతి పొందిన సునీల్ కుమార్.. ఈ వ్యవహారంపై విచారణ చేసి ప్రభుత్వం తప్పు లేదంటే… కావాలనే చెప్పించారన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని రఘురామ హెచ్చరించారు.
గుంటూరులో టీడీపి అధినేత చంద్రబాబు సభ రంగం సినిమాను తలపించిందన్నారు ఎంపి రఘురామ. రాజకీయంగా కుట్రలు ఎలా జరుగుతాయో.. ఆ చిత్రంలో చాలా స్పష్టంగా చూపించడం జరిగిందన్నారు. తొక్కిసలాట ఘటన వెనక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. సభ నుంచి చంద్రబాబు నిష్క్రమించగానే.. ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ ప్రారంభించారన్నారు..బహుశా టీడీపీ అధినేత ఉన్నప్పుడే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉంటే.. తొక్కిసలాట సీన్ ను సృష్టించి ఉండేవారేమో.. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత పేదలకు చీరలు పంపిణీ చేపట్టారని నొక్కి వక్కాణించారు . కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాట ఘటన మరువక ముందే..మరొక ఘటన చోటు చేసుకోవడం చూస్తుంటే.. పోలీసు వైఫల్యం, ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగిన వెంటనే 15 మంది మంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.