సోనియా ప్రధాని కాకుండా అడ్డుకున్నందుకే ములాయం పేరు శాశ్వతం…

Nancharaiah Merugumala(senior journalist) :
==========================
1999 ఏప్రిల్‌ నెలలో అప్పటి అటల్‌ బిహారీ వాజపేయి నేతృత్వంలోని సంకీర్ణ ఎన్డీఏ ప్రభుత్వం (లోక్‌ సభలో ఒక ఓటు తేడాతో విశ్వాస తీర్మానం వీగిపోయి) కూలిపోయింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ తదితర సీనియర్‌ నేతలు ముందుగా రాసుకున్న స్క్రిప్టు ప్రకారం హస్తినలో తదుపరి పరిణామం–కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నాయకురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం.
ఈ రాజకీయ ప్రక్రియలో భాగంగా ‘వామపక్ష, ప్రజాతంత్ర, ముస్లిం’ పార్టీల బయటి నుంచి మద్దతుతో సోనియా సర్కారు ఏర్పాటు విషయం అప్పటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌కు కూడా అధికారికంగా తెలిపారు. సోనియా గాంధీయే స్వయంగా రాష్ట్రపతి భవన్‌ మెట్లెక్కి లోపలికి పోయారు. తొలి దళిత భారత ప్రభుత్వ అధిపతి నారాయణ న్‌ తో ఆమె భేటీ అయ్యారు. అయితే, అప్పటికి ఆమె రాజకీయ అనుభవం ఏడాది మాత్రమే. ఆమె కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని సీతారామ్‌ కేసరి నుంచి గుంజుకున్నది 1998లోనే. ఈ అనుభవరాహిత్యం ఆమెకు శాపమైంది.
కామ్రేడ్‌ సుర్జీత్‌ మాటలు నమ్మి, ప్రధాన మంత్రి కావాలనే తొందరలో, ఆతృతలో, ‘‘ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 273 మంది లోక్‌ సభ సభ్యుల మద్దతు నాకు ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు నన్ను మీరు ఆహ్వానిస్తే–రాష్ట్రపతి భవన్‌ కు వచ్చి మీరు చెప్పిన తేదీన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తాను,’’ అని కేఆర్‌ గారికి సోనియా గాంధీ చెప్పారు అత్యంత వినమ్రతతో. రాష్ట్రపతి కూడా సోనియా ఇచ్చిన మద్దతుదారుల (ఎంపీలు) జాబితా నిజమేనని నమ్మారు. ప్రధానిగా ప్రమాణానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచనప్రాయంగా ఇందిరమ్మ పెద్ద కోడలికి చెప్పారు.
ములాయంను కాపాడిన గోవా బ్రాహ్మణ రోమన్‌ కేథలిక్‌ సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్‌
===================
భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్‌ రాజకీయ సమాధికి మొదట తక్కువ లోతులో గొయ్యి తవ్విన మహానేత డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా. ఆయన ప్రియ శిష్యుడు, సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్‌ తన పాత సోషలిస్టు సంబంధాన్ని (జార్జి, ములాయం–ఇద్దరూ 1967 ఎన్నికల్లో లోహియా నేతృత్వంలోని సంయుక్త సోషలిస్టు పార్టీ–ఎసెస్సీ) గుర్తుచేస్తూ, ములాయం సింగ్‌ యాదవ్‌ తో మాట్లాడారు. ఎందుకంటే, సోనియా అంతకుముందు రాష్ట్రపతికి సమర్పించిన (మద్దతు ఇచ్చే పార్టీల) జాబితాలో 20 మంది సభ్యులున్న సమాజ్‌వాదీ పార్టీ కూడా ఉంది. అప్పటికి ఆరేళ్ల క్రితం 1992 అక్టోబర్‌ నెలలో ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఈ పార్టీ–ఎస్పీని స్థాపించారు. ‘ఒక్కసారి సోనియాగాంధీని ప్రధాన మంత్రిని చేస్తే యూపీలోని ముస్లింలు, యాదవులు, ఇతర బీసీలు కాంగ్రెస్‌ గుడారంలోకి పోతారు. మన రాజకీయ గురువు డాక్టర్‌ లోహియా తన జీవితాంతం కాంగ్రెస్‌ సర్కార్లను కేంద్రంలో, యూపీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో గద్దెదించడానికి కష్టపడ్డారు. ఇప్పుడు నువ్వు ఎర్ర జాట్‌ సిక్కు ముసలాయన సుర్జీత్‌ మాట విని సోనియాను దిల్లీ గద్దెనెక్కిస్తే దేశానికి, నీకూ, మనందరికీ నష్టం. నువ్వు అలాంటి దుస్సాహసానికి తెగబడితే డా.లోహియా స్మృతికి అన్యాయం ఇంకా చెప్పాలంటే ద్రోహం చేసినట్టవుతుంది,’’ అంటూ మంగళూరులో మూలాలున్న సారస్వత బ్రాహ్మణ రోమన్‌ కేథలిక్‌ క్రైస్తవుడు జార్జి ఫెర్నాండెజ్‌ తనకంటే 9 ఏళ్లు చిన్నవాడైన ‘నేతాజీ’ ములాయంకు హితబోధచేశారు.
ఇలా సాటి రోమన్‌ కేథలిక్‌ అయిన సోనియా మైనో ప్రధాని కాకుండా చురుకైన పోషించారు జార్జి సాహబ్‌. వెంటనే ములాయం తమ పార్టీ ఎస్పీ మద్దతు సోనియా గాంధీకి లేదని ప్రకటన చేశారు. ఇంకేముంది సోనియా జీ రాష్ట్రపతి భవన్‌ కు పోయి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు తన వల్ల కాదని చెప్పి వచ్చారు.
ములాయం పుణ్యమా అని సోనియా ‘పరిత్యాగి’ అయ్యారు 2004లో
1999 మండు వేసవిలో ములాయం కొట్టిన రాజకీయ మాడుదెబ్బతో సోనియాగాంధీ 2004లో ప్రధాని పదవి తనకొద్దని ‘రాజకీయ పరిత్యాగి’ అయ్యారు. సోనియాను 15వ శతాబ్దపు ఫ్రెంచి నాయకురాలు జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ తో పోల్చింది పాశ్చాత్య రోమన్‌ కేథలిక్‌ మీడియా. ఇలా 1999లో కాంగ్రెస్‌ పార్టీ దృష్టిలో విలన్‌ గా మారినాగాని ఈ పొట్టి మల్లయోధుడు సోనియాకు తర్వాత ఐదేళ్లకు గ్లోబల్‌ స్థాయి కీర్తిప్రతిష్ఠలు రావడానికి కారకుడయ్యాడు. అయితే, 2008లో అమెరికాతో చేసుకున్న అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీలు డాక్టర్‌ మన్మోహన్‌ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్నాయి. అప్పుడు మాత్రం కాంగ్రెస్‌ ఆధిపత్యంలోని యూపీఏ సర్కారు నిలబడడానికి లోక్‌ సభలో మన్మోహన్‌ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం ద్వారా ములాయం పెద్ద పొరపాటే చేశారు. మరో రకంగా చూస్తే– ఈ చర్య ద్వారాఆయన కాంగ్రెస్‌ పతనానికి గట్టి పునాది వేశారు. విశ్వాస పరీక్షలో ములాయం సాయంతో నెగ్గిన ఏడాది లోపే 2009 ఏప్రిల్‌–మే మాసాల్లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 206 సీట్లు వచ్చాయి. అ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో (2014, 2019) సోనియా–రాహుల్‌–ప్రియాంకా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపునకు అవసరమైన 55 సీట్లు గెలుచుకోలేకపోయింది.
బాబరీ మసీదును 1990 అక్టోబర్‌ నెలలో కూలిపోకుండా కాపాడినందుకు కాదు…
=============================
ములాయం సింగ్‌ పేరును భారతీయులు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది–బాబరీ మసీదును 1990 అక్టోబర్‌ నెలలో కూలిపోకుండా కాపాడినందుకు కాదు. 1999 ఏప్రిల్‌ మాసంలో సోనియా ప్రధాని కావడానికి తన పార్టీకి చెందిన 20 మంది ఎంపీల మద్దతు ఇవ్వకపోవడం ద్వారా ములాయం చారిత్రక పాత్ర పోషించారు. అలాగే, ములాయం యూపీలో యాదవులకో, ఇతర ఓబీసీ కులాల సాధికారతకు చేసిన కృషి కూడా దీనితో పోల్చితే అంత గొప్పదేమీ కాదు. ఆయన కాంగ్రెస్‌ కృశించిపోవడానికి తన రాజకీయ గురువు డా.లోహియా నిర్దేశించిన లక్ష్యాన్ని చక్కగా నిజం కావడానికి ములాయం తన వంతు శ్రమపడ్డారు. డా.లోహియా, చౌధరీ చరణ్‌ సింగ్, దేవీ లాల్‌ మార్గంలో పయనిస్తూ ఓ పక్క యాదవులు సహా ఓబీసీలంతా కాషాయ శిబిరంలోకి పూర్తిగా పోకుండా ములాయం అడ్డుకోగలిగారు.