మునుగోడులో నామినేషన్ వేసిన రాజగోపాల్.. మాటల తూటాలను ఎక్కుపెట్టిన బీజేపీ నేతలు..!!

మునుగోడులో నామినేషన్ వేసిన రాజగోపాల్.. మాటల తూటాలను ఎక్కుపెట్టిన బీజేపీ నేతలు..!!

మునుగోడులో నామినేషన్ల పర్వం మొదలైంది.ఇవాళ ఒక్కరోజే 11 మంది అభ్యర్థులు 16 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు.మొత్తంగా 17 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.అటు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.ఇక ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం ,శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఈనెల 14 వరకు నామినేషన్ల గడువు ఉండగా.. 15 నామినేషన్ల పరిశీలన.. 17 వరకు విత్ డ్రాకు ఈసీ అవకాశం ఇచ్చింది.నవంబర్ 3 న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. 6 న ఫలితం తేలనుంది.

అటు నామినేషన్ అనంతరం రాజగోపాల్ రెడ్డి.. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.తెలంగాణ సమాజం ఒక్క తాటి పైకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన టీఆర్ఎస్ ను బొంద బెట్టే సమయం ఆసన్నమైందన్నారు.ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ కు .. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో బుద్ధిచెప్పాలని అభ్యర్థించారు.తెలంగాణ భవిష్యత్ తరాల బాగుకోసం ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.వ్యక్తిగతంగా ఎదుర్కొలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.ఉప ఎన్నికలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడులో అడుగుపెట్టగానే బీజేపీ నేతల చేతుల్లో కాషాయ జెండా కనిపిస్తుంటే.. టీఆర్ఎస్ నేతల చేతుల్లో మందు గ్లాసులు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు బండిసంజయ్.రాజగోపాల్ రాజీనామాతోనే గట్టుపల్ మండలం వచ్చిందన్నారు.ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్ ను.. మారు మూల లెంకలపల్లి కి తీసుకొచ్చిన ఘనత రాజ్ గోపాల్ రెడ్డిదని కొనియాడారు.నిజాయితీకి మారుపేరైనా రాజగోపాల్ పై కంప్లైట్ చేయడానికి సిగ్గుండాలని ఆగ్రహాం వ్యక్తం చేశారు.గతంలో డబ్బులు కట్టకపోతే బండి గుంజుకుపోయిన చరిత్ర కేసీఆర్ దని.. అలాంటింది ఇపుడు విమానాలు ఎలా కొంటున్నారని ప్రశ్నించారు.కేసీఆర్ కు గుణపాఠం చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.కాంగ్రెస్, టీఆరెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తుంటే .. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ సింహంలా ఒక్కడే పోటీ చేస్తున్నాడని సంజయ్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు.

అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ..రాజ్ గోపాల్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుడు..ఒక్కరు కూడా టీఆర్ఎస్ లో లేరన్నారు.జాతీయ పార్టీ పేరుతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట కలిపే విధంగా.. పార్టీ నుంచి తెలంగాణ పేరు తొలగించడం బాధకారమన్నారు. కేసీఆర్ అహంకారాన్ని దెబ్బతీయడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.ఎన్ని కుట్రలు, ప్రలోభాలకు గురిచేసిన బీజేపీ గెలవడం తథ్యమన్నారు కిషన్ రెడ్డి.

ఇదిలా ఉంటే .. ఈనెల 17 నుంచి బండి సంజయ్ ప్రచారం చేస్తారన్నారు ఉప ఎన్నిక కమిటి కన్వీనర్ వివేక్ వెంకటస్వామి. శ్రీలంక లో ప్రధాని రాజపక్సే అవినీతితో విమానాలు కొంటె ప్రజలు బుద్దిచెప్పారని..అలానే తెలంగాణ రాజపక్సే కేసీఆర్కు తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు.కేసీఆర్ సింగరేణి తడిచర్ల లో 3200 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని వెంకట్ స్వామి ఆరోపించారు.కల్వకుంట్ల కుటుంబం అవినీతి వ్యవహారాలన్ని త్వరలోనే బయటికి వస్తాయన్నారు.ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం ఖాయమని వెంకట్ స్వామి ధీమా వ్యక్తం చేశారు.

రాజగోపాల్ నామినేషన్ ముగిసిన వెంటనే మాటల తూటాలు పేల్చిన బీజేపీ నేతలు.. ప్రచారాన్ని అదేరీతిలో నిర్వహించి ఉప ఎన్నికలో గెలవాలని భావిస్తున్నారు. ఆరునూరైన సరే మునుగోడు గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించి..తెలంగాణలో అధికారంలోకి రావాలని ఉవిళ్లుఊరుతున్నారు.