గత కొద్ది రోజులుగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.దుబ్బాక, హుజురాబాద్ తరహాలో మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని రాజగోపాల్..అమిత్ షాతో చెప్పినట్లు సమాచారం.ప్రస్తుత సమీరణాల ప్రకారం ఉప ఎన్నిక వస్తే రాజగోపాల్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశముందా?అటు కాంగ్రెస్ , అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు ఏమేరకు ప్రభావం చూపనున్నారు? రాజగోపాల్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు ఏంటి?
మునుగోడులో ఉప ఎన్నిక వస్తే రాజగోపాల్ రెడ్డి గెలుపు ఈజీ అన్నది కార్యకర్తల నుంచి వినిపిస్తున్న మాట. ఎమ్మెల్యేగా అతను చేసిన సేవ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులు గెలుపునకు దోహదపడతాయన్న ధీమా వారిలో కనిపిస్తోంది. అంతేకాక కోమటిరెడ్డి బ్రదర్స్ కి .. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ పరంగా మాత్రమే కాకుండా.. వ్యక్తిగత ఇమేజ్ కలిసోస్తుందని వారి అభిప్రాయం. పార్టీలకు అతీతంగా సోదరులకు అభిమానులు ఉన్నారు. ఈక్రమంలో రాజగోపాల్ పార్టీ మారితే.. నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ సైతం అతని వెంట వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాక హస్తం పార్టీలో అతని తర్వాత చెప్పుకొదగ్గ నాయకుడు కనిపించడంలేదు. దీంతో ఆపార్టీ మరింత బలహీనపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అటు అధికార టీఆర్ఎస్ ఉప ఎన్నిక వస్తే తాము సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని గట్టుపల్ మండల కేంద్రంగా చేయాలని..టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైతే.. గట్టుపల్ అంశాన్ని ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. అయితే ఆపార్టీలో వర్గ విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. గత ఎన్నికల్లో కూసుకుంట్ల ఓడిపోవడానికి ఇది ఓ కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అభ్యర్థి విషయంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ మొదలైంది.
టీఆర్ఎస్ నుంచి రేసులో…
ఒకవేళ అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ మార్పులు చేయాలని భావిస్తే.. రేసులో మాజీ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్, మంత్రి జగదీష్ రెడ్డి సన్నిహితుడు నారబోయిన రవి (జడ్పీటీసి స్వరూపరాణిభర్త)తో పాటు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రోడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి సైతం పోటిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరందరూ తమ ఉనికిని చాటుకునేందుకు నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తున్నారు.
మొత్తంమీద మునుగోడు వ్యవహరం రాష్ట్రంలో సరికొత్త రాజకీయానికి తెరలేపింది. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ కొత్త సమీకరణాలకు కేంద్ర బిందువైంది. ఒక వేళ ఉప ఎన్నిక వచ్చి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ..నల్లగొండ రాజకీయం రూపురేఖలు పూర్తిగా మారుతాయన్న ప్రచారం ఊపందుకుంది. అటు టీఆర్ఎస్ గెలిస్తే.. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు దీనిని ఓ అస్త్రంగా వాడుకోవాలని నాయకత్వం చూస్తోంది.