Janasena; ‘ ప్రభుత్వంలో జనసేన పార్టీ ఉండాలన్న బలమైన ఆకాంక్షతో, అధినేత పవన్ కళ్యాణ్ మీద అచంచల నమ్మకంతో ప్రజలు ఓటు వేశారు. ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. తెనాలి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అంతా ఆశ్చర్యపోయే రీతిలో తెనాలి రూపురేఖలు మార్చే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. పెదరావూరు నుంచి మంగళగిరి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కోసం మంత్రి నారా లోకేశ్ తో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ప్రజల దగ్గర మాట రాకుండా పని చేయాలన్నారు. జనసేన నాయకులు అద్భుతంగా పని చేయాలని సూచనలు. చేశారు. గురువారం నుంచి ప్రారంభం అయిన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. గత ఏడాదికి రెట్టింపు సభ్యత్వాలు లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. గురువారం సాయంత్రం తెనాలిలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు సీనియర్ కార్యకర్తలకు స్వయంగా క్రియాశీలక సభ్యత్వాన్ని అందజేశారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ.. “గత ప్రభుత్వం ప్రతి శాఖని కొల్లగొట్టింది. ప్రభుత్వం ముందు ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. చివరికి బడికి వెళ్లే పిల్లలకి కల్పించాల్సిన సౌకర్యాల్లో కూడా దోపిడి చేశారు. గత ఐదేళ్లలో ఒక్క రోడ్డుకి మరమ్మత్తు చేయలేదు. పరిపాలన చేతకాక ప్రజల్ని ఇబ్బందులు పెట్టారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ప్రజలకు గుర్తున్నాయి. మనం రాజకీయ ప్రత్యర్థిని ఉద్దేశపూర్వకంగా విమర్శించవద్దు. అలా అని జనసైనికుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని గ్రామ స్థాయిలో కేసులు పెట్టి ఇబ్బందులుపెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదు. కూటమిగా పోటీ చేయగా జన సైనికులు టీడీపీ, బీజేపీ పోటీ చేసిన చోట అద్భుతంగా మద్దతు ఇచ్చారు. అలాగే జనసేన అభ్యర్ధులు పోటీ చేసిన చోట భారీ మెజారిటీలు వచ్చాయి. తెనాలి చరిత్రలోనే మొట్టమొదటిసారి 50 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించాం. మనం అధికారంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని జనసైనికులు, పార్టీ నాయకులు ముందుకు వెళ్లాలి. సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన తెచ్చుకుని అమలు ప్రక్రియను పరిశీలించాలి. అర్హులైన లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూడండి. అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికీ చేరాలి. ఇప్పటికే ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతి వార్డులో డ్రైనేజీలు, కాలువలు మరమ్మత్తులు చేస్తాం. ఏడాది లోపు తెనాలి నియోజకవర్గం మొత్తం సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేస్తాం ..పార్కులు అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. అందుకు సంబంధించిన కార్యచరణ సిద్ధం చేశాం. పార్టీ నాయకులంతా గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోండి. విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం. నేను మీకు అండగా నిలబడతా.. పార్టీలకతీతంగా ప్రజలకు సేవ చేద్దామని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
తెనాలిలో క్రియాశీలక సభుత్వం రెట్టింపు కావాలి..
దేశంలో మరే రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు, ఆపత్కాలంలో వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ ప్రక్రియలో బీమా పథకాన్ని చేర్చారన్నారు మనోహర్. దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుని కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయినప్పుడు రూ. 5 లక్షల బీమా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దామన్నారు. గత మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 344 కుటుంబాలను ఆదుకుంటే, అందులో మొదటి చెక్కు దురదృష్టవశాత్తు తెనాలి నియోజకవర్గంలోనే ఇచ్చామని.. పార్టీ నిర్మాణ ప్రక్రియలో క్రియాశీలక సభ్యత్వం ఒక భాగమని తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పని చేయడానికి అది ఉపయోగపడుతుందన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఒక లక్ష్యం పెట్టుకుని పని చేయాలని.. గత ఏడాది తెనాలి నియోజకవర్గ పరిధిలో 6 వేల క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేశామని అన్నారు. ఈసారి ఆ సంఖ్య 12 వేలకు చేరాలన్నారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా గ్రామ, మండల స్థాయిలో కమిటీల ద్వారా కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించవచ్చని..ప్రజలు గుర్తించేలా పని చేద్దామని నాదెండ్ల మనోహర్ సూచించారు.
వైసీపీ కౌన్సిలర్లు జనసేనలో చేరిక…
తెనాలి మున్సిపాలిటీ నుంచి వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు.. వారికుటుంబ సభ్యులు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేరారు. 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు, 30వ వార్డు కౌన్సిలర్ కె. జైపాల్, 29వ వార్డు కౌన్సిలర్ తండ్రి శ్రీనివాస్ నాయక్, 32వ వార్డు కౌన్సిలర్ ఎం. సంధ్యారాణి భర్త రాజేష్, 9వ వార్డు కౌన్సిలర్ భర్త వీరిశెట్టి భాస్కర్ వైసీపీని వీడి జనసేనకు వచ్చారు. వీరితోపాటు పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. వీరందరికీ మనోహర్ జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.