జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం: నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజల్ని కంకణబద్దుల్ని చేసే వేదిక ఈ ఆవిర్భావ సభ అన్నారు. సభా వేదికపై రైతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు పేరిట సభా వేదికను ఏర్పాటు చేస్తామని.. జాతి గర్వించే మహానుభావుడు పింగళి వెంకయ్య, స్వతంత్ర సమర సాయుధ పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగాలను స్మరించుకునే విధంగా సభ ప్రాంగణం ఉంటుందని తెలిపారు. మార్చి 14వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహిలో బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారని చెప్పుకొచ్చారు. రాబోయే పది రోజుల్లో సభ కోసం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వైసీపీకి వ్యతిరేంగా పాల్గొనాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని మనోహర్ పేర్కొన్నారు.