TDP: ఏపీ రాజకీయం రోజురోజుకీ మారుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో పొలిటికల్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. రాజమండ్రి లోనే ఉంటు పార్టీ నేతలతో కలిసి నిరసన సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె బస్సు యాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాత్రకు సంబంధించి టీడీపీ నేతలు రూట్ మ్యాప్ ను సిద్దం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ‘ మేలుకో తెలుగోడా’ పేరిట జనంలోకి వెళ్ళాలని ఆమె నిర్ణయించుకున్నారు. నాలుగున్నర ఏళ్ల తుగ్లక్ పాలన ఎలుగెత్తి చాటడమే యాత్ర ప్రధాన ఉదేశ్యమని ఆ పార్టీ ముఖ్య నేత మాటల్లో మాటగా చెప్పుకొచ్చారు.
కాగా బస్సు యాత్ర భువనేశ్వరి పుట్టినిల్లు ‘ నిమ్మకూరు ‘ నుంచి మెట్టినిల్లు ‘ నారావారి పల్లె ‘వరకు సాగేలా టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక యాత్రకు సంబంధించి.. ‘ మేలుకో తెలుగోడా ‘.. ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.. మేలుకో ఆంధ్రుడా ‘ .. ‘రా కదలిరా తెలుగోడా.. మేలుకో ఆంధ్రుడా ‘.. ‘ప్రజాగళం ‘ ‘ జన గళం ‘ ‘ జాగో ఆంధ్రప్రదేశ్ ‘ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. గతంలో ఆమె తండ్రి దివంగత ఎన్టీఆర్ చైతన్య రథ యాత్ర చేసినప్పుడు ‘ చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ పాటనే యాత్రకు పేరు పెడితే సెంటిమెంట్ పండుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉంటే చంద్రబాబు కేసులో అక్టోబర్ 3 వ తేదీన క్వాష్ పిటీషన్ పై కోర్టుతీర్పు వెలువడిన అనంతరం భువనేశ్వరి బస్సు యాత్రపై క్లారిటీ రానుంది. ఒక వేళ తీర్పు సానుకూలంగా రాని పక్షంలో దండయాత్ర.. అనుకూలంగా వస్తే విజయ యాత్ర చేయాలని భువనేశ్వరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రకు చంద్రబాబు కోర్ టీమ్ అంతా సమన్వయంతో భువనేశ్వరికి సహకరించే అవకాశాలున్నాయి.