ప్రధాని మోదీ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దుర్వినియోగం వెనక మోదీ హస్తం ఉండకపోవచ్చని.. రాష్ట్రంలో సీబీఐ,ఈడీ దూకుడుకు కారణం స్థానిక బీజేపీ నేతలని దీదీ ఆరోపించారు.స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే కొందరు నేతలు.. సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారని అంటూ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఉన్నట్టుండి మమతా బెనర్జీలో మార్పుకు కారణమేంటన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ అంత చెడ్డది కాదని ప్రశంసలు కురిపించిన దీదీ.. తాజాగా మోదీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్షనేతలు జీర్ణించుకులేకపోతున్నారు. మమతా బెనర్జీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని.. సీబీఐ కేసుల్లో ఇరుకున్న తృణమూల్ నేతలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అటు తృణమూల్ నేతలు దీదీపై ఆరోపణలను ఖండించారు. మమతా ఎవరూ మెప్పుకోసం వ్యాఖ్యలు చేయలేదని.. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు మాత్రమే మాట్లాడారని తేల్చిచెప్పారు.
ఇదిలా ఉంటే..కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బెంగాల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం సందర్భంగా మమతా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ లో సీబీఐ దాడుల వెనక మోదీ ప్రమేయం లేదని తాను విశ్వసిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.స్థానిక బీజేపీ నేతలే స్వప్రయోజనాల కోసం .. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.ఇలాంటి నేతలపై ప్రధాని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కాగా తీర్మానానికి 189-69 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తీర్మానాన్ని వ్యతిరేకించింది. శాసనసభ నిబంధనలకు ఈ తీర్మానం వ్యతిరేకమని విపక్ష నేత సువేందు అధికారి ఆగ్రహాం వ్యక్తం చేశారు.