నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు..

నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు..

Hyderabad:  నవ్యనాటక సమితి 48వ ఆల్‌ ఇండియా మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ పోటీల ముగింపు కార్యక్రమాలు రవీంద్రభారతిలో శనివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి ప్రసంగిస్తూ.. నవ్యనాటక సమితి సంస్థ నిరాటంకంగా ప్రతి సంవత్సరం కళాకారులను ప్రోత్సాహిస్తూ జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.  వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించిడమే నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో ఉన్న ప్రత్యేక గుర్తింపుకు నిదర్శనమన్నారు. పోటీలలో విజేతలుగా నిలిచిన కళాకారులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన తెంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ శ్రీమతి దీపికా రెడ్డి ప్రసంగిస్తూ నవ్యవనాటక సమితి వారు నిర్వహించే పోటీలు కళాకారులకు ఉత్సాహాన్నిస్తున్నాయన్నారు. నవ్యనాటక సమితి పోటీల విజేతలకు జాతీయ స్థాయిలో  గుర్తింపు లభిస్తుందని ఆమె అన్నారు.

కర్ణాటక, హిందుస్తాని సంగీతాలలో, వాద్య పరికరాలలో, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, కథక్‌ మొదలగు రంగాలలో విశేష ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచిన వందకుపైగా కళాకారులకు ఈ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేశారు. సీనియర్స్‌, జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌ విభాగాలలో ఆగస్టు 26 నుండి సెప్టెంబర్‌ 2 వరకు ఈ పోటీలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో జూనియర్‌ వయోలీన్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ ప్రథమ స్థానంలో నిలిచారు. వివిధ రంగాలలో విజేతలుగా నిలిచిన కళాకారులతో నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. ఈ కార్యక్రమానికి నవ్యనాటక సమితి చైర్‌పర్సన్‌ శ్రీమతి ఆనంద అధ్యక్షత వహించారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, భారత్‌ బయోటిక చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ప్రముఖ సంగీత కళాకారులు డా.తాడేపల్లి లోకనాథ శర్మ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.