Naresh Nunna:
ఉత్తమ ఒరిజినల్ సాంగ్, మ్యూజిక్ కేటగిరీలో ‘నాటు నాటు…’ పాట ఆస్కార్ అవార్డు వచ్చింది. తెలుగు సినీ సంగీత సాహిత్య పాటవాలు ఆ పాట ద్వారా వెల్లడి కావడం, ఆస్కార్ వేదిక వరకూ అనేక దశల్ని దాటుకుంటూ వెళ్లిన RRR సినిమా – తెలుగు వాడి సినీ నిర్మాణ ప్రతిభకి గీటురాయిగా నిలవడం – వ్యక్తిగతంగా నాకు బాధాకరమే. ప్రపంచస్థాయి కళాసృజన, సాహితీసాంస్కృతిక సంపద ఉన్న మన గర్వోన్నత తెలుగు జాతికి సినీరంగం నుంచి ఇటువంటి హీన ప్రాతినిథ్యమా అని చింత ఉన్నా, మనకి అంతే ప్రాప్తమని సరిపుచ్చుకోవడం తప్ప చేసేదేముందని నా తాహతుకి తగ్గట్టుగా నిట్టూర్చాను.
ఈ సందర్భంగా నాకు ఎప్పటినుంచో ఉన్న సందేహం మళ్లీ తలెత్తింది: ఏదైనా చెత్త సినిమాలో ఉత్తమ నటన, మంచి మాటలు, గొప్ప పాటలు – ఉంటాయా? అంటే, పనికిరాని బైకులోంచి కావల్సిన పార్టుల వరకూ తీసుకున్నట్టు, ప్రాణంలేని శరీరంలోంచి పనిచేసే అవయవాలు వాడుకున్నట్టు- చెత్త సినిమాలోంచి కొన్ని మంచి విభాగాల్ని విడదీసి మిడిసిపడొచ్చా- అన్నది నా డౌటు.
నా వరకైతే నేను అలా చూడలేను. RRR చెత్త సినిమా అని నా అభిప్రాయం ( bit.ly/3TdVCgU , bit.ly/426piRp ) ఇదివరకే చెప్పుకున్నాను. కాబట్టి, దాంట్లో మాటలు దంచేశారా, విజువల్ ఎఫెక్ట్స్ చించేశారా, భీమ్ గా ఎన్టీఆర్ ఇరగదీశాడా… వంటి అంశాల జోలికి వెళ్లలేదు; అలాగే గందరగోళాల మీదుగా బంగారు గోళాలు (Golden Globe) వరకూ సాగిపోతున్న పాటల్నీ పట్టించుకోలేదు.
అయితే, అకాడమీ అవార్డుల రూల్ 15 (ఒరిజినల్ పాట- సంగీతాల విభాగం)లోని కొన్ని నిబంధనలు నాలో కొంత ఆసక్తిని రేపాయి. ఈ అవార్డు పరిశీలనకి దాఖలుచేసే పాటలు- “must be substantively rendered, clearly audible, and intelligible, and must further the story-line of the motion picture. An arbitrary group of songs unessential to the story-line will not be considered eligible.” అని ఒకానొక నియమం స్పష్టంగా నిర్దేశించింది. అంటే ఆ సినిమా గమనానికి మరింత తోడ్పడి, దాని కథనాన్ని మరింత కదంతొక్కించాలని, కుక్కమూతి పిందెలాంటి పాటలు అవార్డు పరిశీలనకి అసలు పనికిరావని కదా ఆ నియమం చెబుతోంది. అప్పుడు కలిగింది నాకు ఆసక్తిలా కనిపించే ఉత్సుకత: నా దృష్టిలో అనవసరమైన ఆ ‘నాటు… నాటు’ పాటని – తొలి వడపోత కార్యక్రమం నిర్వహించే అకాడమీ మ్యూజిక్ బ్రాంచ్ సభ్యులు ఎలా చూస్తారు? ఎన్నెన్ని మార్కులు వేస్తారు? ఆ పాటలో పస, దాని కూర్పులో నైపుణ్యం, కల్పనా చాతుర్యం, వీటన్నింటితో పాటు కథాపరంగా దాని ప్రాముఖ్యత ఎలా అంచనా వేస్తారు? అవేవీ తెలిసేంత నెట్వర్క్ నాకు లేకపోవడం వల్ల ఫలితం మాత్రమే తెలిసింది, నలుగురితో పాటు.
తొలి వడపోత దశని దాటుకొని, నామినేట్ అయిన చిట్టచివరి 5 పాటల్లో ‘నాటు… నాటు…’ ఒకటిగా నిలవడం మాత్రం ఆశ్చర్యమనిపించింది. మిగతా నాలుగు పాటల గురించి, విజేత ఎవరనే ప్రిడిక్షన్స్ గురించీ ఆర్టికల్స్ చూస్తుంటే- బరిలో నిల్చిన ఈ ఐదింటిలో RRR- ‘నాటు నాటు’ పాటే హాట్ ఫేవరేట్ అని ఎక్కువ శాతం విశ్లేషకులు రాసుకొచ్చారు. పాపులర్ మీడియా హౌస్ NPR నుంచి స్టిఫెన్ థాంప్సన్ అనే చెయ్యి తిరిగిన విశ్లేషకుడి అభిప్రాయం ఇది: https://www.npr.org/2023/03/06/1155451988/the-2023-oscars-best-original-song-nominees-cruelly-ranked.
అదే జరిగింది- ‘నాటు… నాటు..’ ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అయ్యింది. ‘భూమి దద్దరిల్లేలా… వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా…’ వంటి పదాలు స్టిఫెన్ కి ఎలా అర్థమయ్యాయో గానీ, RRR సినిమా గురించి, ‘నాటు నాటు’ పాట గురించీ – రంకెలేసి ఎగిరినట్టే రాసుకొచ్చాడు, “RRR is an absolute meal of a movie: Three hours of grand, epic spectacle…” అంటూ.
డైనీ వారెన్ రాసి, సోఫియా కార్సన్ పాడిన- ‘Tell It Like a Woman’ చిత్రగీతం- ‘Applause’ ని, ‘నాటు నాటు’నీ పోటికి పక్క పక్కనే పెట్టడం అంటే- blobfish (సృష్టిలోనే అత్యంత అనాకారమైన జీవిగా గుర్తించబడిన చేప)- రామ్ చరణ్ … రెండూ ప్రాణమున్న జీవులే అని పోల్చినట్టు- అని రాసేసేంత ఓవర్ చేసేశాడు స్టిఫెన్.
అందరూ ఇలా మోయడానికి, స్పిల్ బర్గ్, కామొరూన్ వంటి హాలీవుడ్ పెద్ద తలలు కూడా పొగడటానికి కారణం – బహుశా వాళ్లు ఔట్ సైడర్స్ కావడం వల్లనా- అని ఆలోచించాను.
అల్లూరి సీతారామరాజు- కొమురం భీమ్ – కేవలం పేర్లే తప్ప, వాళ్ల కార్యాలతో, కాలాదులతో సంబంధమే లేదనీ, కనీస తర్కాన్ని, సహజ ఇంద్రియజ్ఞానాన్నీ కూడా ఎక్కడా వాడొద్దు అని, ‘పొగాకు- మద్యపానాలతో పోతావ్…’ అనే యాడ్ కంటే ఎక్కువ ప్రస్ఫుటంగా RRR కథకుడు- దర్శకుడు ప్రకటించినా కూడా, ఎంతో కొంత, ఏదో ఓ చోట మన insiders ఆలోచన- ఇంగితం దగ్గరకి వెళ్లకుండా ఆగదు.
‘పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు… పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు…” అని పాటని మొదలెడతాడు అల్లూరి సీతారామరాజు. ఆయన పుట్టి పెరిగిన తూర్పుగోదావరి, విశాఖమన్యం ప్రాంతాల్లో 1920ల నాటికి పోలేరమ్మ జాతర, అందులో పోతురాజు శివాలెత్తి చిందులేయడం లేవు కదా – అని insiders కి అనిపింస్తుంది. కానీ, బైటవాళ్లకి పట్టింపు ఉండదు. గోండుల సాంస్కృతికచిత్రం distort అయ్యిందని మనం గింజుకుంటాము గానీ, బైటవాడికి ఆ context కేవలం on the face of the frame మాత్రమే కదా.
కాబట్టి, ‘నాటు నాటు’ పాట- అందులోని చిందులానే కథకి ఊపు, ఉత్సాహం అని ఆ ఔట్ సైడర్స్ కి అనిపించి ఉండొచ్చు. కానీ, వాళ్లు కూడా అడ్డం తిరగాల్సిన చోట ఎలా అంజాన్ కొట్టేశారా, తప్పు పట్టాల్సిన వేళ ముఖం చాటేశారా – అని నా మరో అనుమానం.
ఈ పాటకి ముందు కోటలోకి వస్తారు రామ్- భీమ్ ద్వయం. ‘బ్రౌన్ బగ్గర్స్’ అని ఈసడించబడతారు, ‘కళ గురించి, దాని కసుగాయతనం గురించి మీకేం తెలుసోయ్…’ అని హేళనకి గురవుతారు. మరిక డ్యాన్స్ గురించి అయితే ఇంకేం తెలుస్తుంది- అని కొన్ని డ్యాన్స్ రీతుల పేర్లు చెబుతాడు జేక్ (Eduard Buhac)- ‘Tango’… ‘Swing’… ‘Flamenco’! ‘వీటిల్లో ఏదైనా చేయగలరా’ అని ఎగతాళిగా అడుగుతాడు రామ్- భీమ్ ని.
“Not Salsa. Not Flamenco, my brother! Do you know ‘Naatu’? అని ‘నాటు నాటు’ పాట ఎత్తుకుంటాడు రామ్.
జాజ్ మ్యూజిక్ తర్వాత పుట్టి, తర్వాత దశాబ్దాల తర్వాత గాని ప్రాచుర్యంలోకి రాని ‘స్వింగ్’ డ్యాన్స్ గురించి, RRR కథాకాలమైన 1920ల్లోనే జేక్ ఎలా ప్రస్తావించాడు? జేక్ అడగని Salsa డ్యాన్స్ పేరెత్తుతాడు రామ్. ఎక్కడో స్పానిష్ కాలనీ అయిన క్యూబాలో పుట్టి, సెంట్రల్ అమెరికా నుంచి ఉత్తరమెరికాకి 1960ల నాటికి గాని రాని సల్సా డ్యాన్స్ గురించి 1920ల్లో రామ్ ఎలా మాట్లాడాడు?
– ఇవి insiders అయిన మనకి పట్టకపోవచ్చు, కానీ, outsiders అయిన వాళ్లకి- వాళ్ల వ్యవహారాలే కాబట్టి- పంటిలో రాళ్లు కావాలి కదా; కానీ కాలేదు.
ఇన్ని అవకతవకల కుప్పగా, తప్పుల తడకగా ఉంటే- దాన్ని ఒరిజినల్ పాటగా, సినిమాని మరింత ఉద్దీపం చేసిన గొప్ప సంగీత సందర్భంగా ఎలా తలకెత్తుకొని ఊరేగించింది ఆస్కార్ అంబారీ??