రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో అదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది. వెంకయ్య వారసుడిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ ను ఎంపిక చేసింది. పంజాబ్ మాజీముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, నఖ్వీ పేర్లు వినిపించినప్పటీకి ధన్ ఖడ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది.
ఇటీవలే బెంగాల్ గవర్నర్ ఇంట్లో సీఎం మమతా బెనర్జీతో జరిగిన ఆత్మీయ సమావేశం .. ధన్ ఖడ్ ఎంపిక లాంఛనమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈభేటికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మధ్యవర్తిత్వంగా వ్యవహరించారు. అయితే గవర్నర్, సీఎం మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. ఈనేపథ్యంలో మమతా బెనర్జీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో .. టీఎంసీ పార్టీ అభ్యర్థిగా బీజేపీ మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను నిలబెట్టిన ఆమె.. అనేక పరిణామాల అనంతరం ముర్ముకు జైకొట్టింది. ఇప్పుడు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతుస్తుందా? లేక బీజేపీ నిర్ణయించిన అభ్యర్థి వైపు మొగ్గు చూపుతుందా? అన్నది చర్చనీయాంశమైంది.
వెంకయ్య వారసుడు బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ నేపథ్యం గురించి సీనియర్ జర్నలిస్ట్ నాంచారయ్య గారి విశ్లేషణ..
Nancharaiah Merugumala :
కమ్మ ఉపరాష్ట్రపతికి వారసుడిగా జాట్ నేత జగదీప్ ధన్ ఖఢ్
—————————–
ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి వారసుడిగా ఆయనలా వ్యవసాయాధారిత కులం (జాట్) నుంచి పైకొచ్చిన నేతను బీజేపీ ఎంపిక చేసింది. రాజస్థాన్ జాట్ కుటుంబంలో పుట్టిన జగదీప్ ధన్ ఖ ఢ్ వెంకయ్య కంటే దాదాపు రెండేళ్లు చిన్న. జాట్ కులస్తులకు సముచిత ప్రాతినిధ్యం ఉన్న పూర్వపు జనతాదళ్ టికెట్ పై జగదీప్ 1989లో రాజస్థాన్ ఝంఝనూ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లోక్ సభకు ఎన్నికైన ఐదు నెలలకు విశ్వనాథ ప్రతాప్ సింగ్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల ఉపమంత్రి అయ్యారు. మొత్తానికి లోక్ సభ మాజీ స్పీకర్, పంజాబ్ కాంగ్రెస్ హిందూ జాట్ నేత బలరాం జాఖఢ్ తర్వాత రాజ్యాంగ పదవి (ఉపరాష్ట్రపతి/రాజ్యసభ ఛైర్మన్) చేపడుతున్న జాట్ రాజకీయనేత జగదీప్ ధన్ ఖఢ్. కలకత్తాలో బ్రాహ్మణ ముఖ్యమంత్రి దీదీ మమతా బెనర్జీతో గొడవపడి ఆమె సర్కారును అంతగా సతాయిస్తే తప్ప (పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా జగదీప్ జీ చేసింది ఇదే) -జాట్ నేతకు పదవి రాదన్న మాట!
మాస్టర్ స్ట్రోక్ :
కాంగ్రెస్ విస్మరించిన జాట్ కులస్తులను ఇన్నాళ్లకు భాజపా గుర్తించడం మంచి పరిణామం. ఉపరాష్ట్రపతి పదవికి జాట్ కుటుంబంలో పుట్టిన జగదీప్ ధ న్ ఖ ఢ్ ను ఎంపిక చేయడం ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా మాస్టర్ స్ట్రోక్ అని మీడియా భాషలో చెప్పుకోవచ్చు.