Nellore: మరో పోరాటానికి సిద్ధమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి..

Nellore: మరో పోరాటానికి సిద్ధమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి..

Nellore : నిరంతరం వార్తల్లో ఎప్పుడూ ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో పోరాటానికి సిద్ధమయ్యారు. భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను కేటాయిస్తూ జీవో విడుదల చేసి ఇప్పటికి 9 నెలలైనా నిధులను మాత్రం మంజూరు చేయకపోవడంతో ఆయన పోరాట పంథా ను ఎంచుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సంతకానికే విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ నెల్లూరు జిల్లాలోని ప్రతి మసీదు దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న మత పెద్దలు మౌజాంలు ఇతర మైనార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

 

కాగా బారాషాహీద్ దర్గాకు మంజూరైన నిధులు, వాస్తవ పరిస్థితి ఇంతవరకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడం వల్ల విడుదల చేయలేదని వారికి వివరించి వారి మద్దతును కూడగట్టే ప్రయత్నాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏ కాకుండా నెల్లూరు జిల్లాలోని అన్ని మసీదుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి పోస్ట్ కార్డులు, ఎస్ఎంఎస్ లు వాట్సాప్ రూపంలో నిరసన తెలియజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మైనార్టీలను పెద్ద ఎత్తున కూడగట్టే ప్రయత్నం జరుగుతోంది. నెల్లూరు జిల్లాలో బారాసాహి దర్గాతో ప్రతి ఒక్కరికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన దర్గాకు నిధులు విడుదల చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని తెలియజేయడమే లక్ష్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడుగులు పడుతున్నాయి. ఈ పోరాటంతో నైనా ముఖ్యమంత్రి సంతకానికి విలువనిస్తూ బారాషాహిద్ దర్గాకు నిధులు మంజూరవుతాయని మైనార్టీలు ఆశతో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి నెల్లూరు రూరల్ లో మరో పోరాటానికి రంగం సిద్ధమైంది.