కోకా సుబ్బారావు తర్వాత రెండో తెలుగు దివిటీ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ

Nancharaiah Merugumala (senior journalist):

రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి రెడ్ ఫోర్ట్ వరకూ పొన్నవరం పౌరుడి యాత్ర
————————————————
కలిమి జలాక్షరాలు… చెలిమి శిలాక్షరాలు. సంపద నీటిపై అక్షరాలు రాయడం వంటిదైతే…స్నేహం రాతిపై చెక్కే శాసనంలా శాశ్వతమైనదని-మొదటి నాలుగు మాటల అర్థం ఇది.
— బార్ అసోసియేషన్ తో తనకు ఉన్న అనుబంధం గురించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ గురువారం ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలోని మాటలు ఇవి. శుక్రవారం సీజేఐ గా రిటైరవుతున్న జస్టిస్ రమణ ఈ అత్యున్నత పదవి సాధించిన రెండో తెలుగు న్యాయకోవిదుడు. 1960ల చివర్లో రాజమండ్రికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు గారు తొలి తెలుగు సీజేఐ గా చరిత్రకెక్కారు. రమణ గారి మాదిరిగానే సుబ్బారావు గారు కూడా అగ్రకుల సూద్రుడు. సుబ్బారావు గారు ఆది వెలమ. రమణ గారు పాత పశ్చిమ కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలోని కమ్మ రైతు కుటుంబంలో పుట్టారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువగా బ్రాహ్మణ న్యాయాధీశులనే నియమించడానికి ఇష్టపడే నెహ్రూ-ఇందిరా కాంగ్రెస్ జమానాలో కోకా సుబ్బారావు గారు సీజేఐ కావడం తెలుగు కోస్తా జిల్లాల అగ్రకుల సూద్రుల సామాజిక ఎదుగుదలకు తిరుగులేని సాక్ష్యం. కొన్ని నెలల్లో సీజేఐ పదవి పూర్తి కావడానికి ముందు సుబ్బారావు గారు తన అత్యున్నత పదవికి 1967లో రాజీనామా చేసి మరో రికార్డుకు తెరతీశారు. 1967 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారిపై ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేశారు జస్టిస్ కోకా. మళ్లీ 57 ఏళ్లకు ఒక తెలుగు సీజేఐ ఈరోజు పదవీవిరమణ చేయడం గొప్ప చారిత్రక సందర్భం. All the best Justice NV Ramana garu.