Nancharaiah Merugumala (senior journalist):
————————————–^———
2004 నుంచీ చావు దారిన వేగంగా నడుస్తోంది కాంగిరేసు పార్టీ. పదేళ్ల తర్వాత దిల్లీలో అధికారం కోల్పోయింది. నరేంద్రమోదీ ప్రధాని అయినాక కాంగ్రెస్ పతనానికి పార్టీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఆమె కొడుకూకూతుళ్లు రాహుల్, ప్రియాంకా పరోక్షంగా కారకులయ్యారు. వారి దివంగత కుటుంబ పెద్ద ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు (1969,1978) చీల్చి దాన్ని బతికించారు. ఈ స్థాయిలో తర్వాత కాంగ్రెస్ పార్టీని శరద్ పవార్ గాని, ఎన్డీ తివారీ-అర్జున్ సింగ్ గానీ చీల్చి విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు వృద్ధాప్యంతో భారత జాతీయ కాంగ్రెస్ మరణించకుండా చూడాలంటే-దాన్ని నిట్ట నిలువునా చీల్చడమో తాత్కాలికంగా చంపడమో తక్షణమో చేయాలి. రాజనీతి శాస్త్రజ్ఞులు ఇస్తున్న సలహా ఇది.
అందుకే, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు ఎలాంటి సంశయాలు, అనుమానాలు లేకుండా కాంగ్రెస్ పార్టీని చావనిచ్చినా నష్టం లేదు. కానీ, కాంగ్రెస్ కు ఇరుసు వంటి సోనియా-రాహుల్-ప్రియాంకా కుటుంబాన్ని మాత్రం కాంగ్రెసోళ్లు తప్పక కాపాడుకోవాలి. ఇందిరమ్మ తరహాలో సచ్చిన కాంగ్రెస్ పార్టీని సైతం బతికించే సత్తువ నెహ్రూ-గాంధీ ఫ్యామిలీకి ఉంది. అందుకే, ఇప్పటికే ఇద్దరు కుటుంబ సభ్యుల ప్రాణాల్ని భారతదేశం కోసం త్యాగం చేసిన సోనియా కుటుంబసభ్యుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండవల్లి అరుణ్ కుమార్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరకూ ఉన్న ఛోటామోటా నాయకులపై ఉంది. ఎందుకంటే, అసెంబ్లీలో అడుగుబెట్టే శక్తి కూడా లేని ఇలాంటి నేతల్ని సోనియమ్మ పార్లమెంటు భవనం మెట్లు ఎక్కి లోపలికి చొరబడే అవకాశం ఇచ్చారు.