9.2 C
London
Wednesday, January 15, 2025
HomeEntertainmentteluguliterature:విరబూసిన ఆ కథలే.... సి.రామచంద్రరావు..!

teluguliterature:విరబూసిన ఆ కథలే…. సి.రామచంద్రరావు..!

Date:

Related stories

literature: కులం అనే ఆలోచనకు ప్రేమే పరిష్కారం..!

విశి: కుట్టి రేవతి తమిళ కవయిత్రి & సినీ గీతరచయిత్రి. అసలు పేరు...

sankranti2025: 3 డీ టైప్స్ ముగ్గులు..ప్రత్యేకం..!

సాహితీ, ప్రసిద్ధ, మౌక్తిక: ...

literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!

Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట...

BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

BJP: బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల...

vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!

Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం...
spot_imgspot_img

Taadi Prakash:

ఆరేడు రోజుల క్రితం రామచంద్రరావు గారు
ఫోన్ చేశారు . రమ్మన్నారు . వెళ్ళాను .
94 ఏళ్ల వయసులో నిబ్బరంగా , హుందాగా
వున్నాడు . చాలా కబుర్లు . కాలక్షేపానికి కొన్ని
కథలు చెప్పాను . విన్నాడు . ప్రశ్నలు వేశారు .
కొత్త కథ రాయబోతున్నా అన్నారు . కథచెప్పారు
రాయమని ఎంకరేజ్ చేశాను . సెప్టెంబర్ 17
పెద్దాయన పుట్టిన రోజని …ఈ old post

మన వాళ్లు వొట్టి వెధవాయిలోయ్!

ఎంతసేపూ 30 రోజుల్లో రామోజీరావు అవ్వడం ఎలా? అన్న పాడు బుద్ధులే తప్ప, పది కథల్తోనే ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవడం ఎలా? అని ఆలోచించే వాళ్లెవరైనా వున్నారా? ఒక్క సి.రామచంద్రరావుగారు తప్ప!

ఏ కొద్దిమందినో మినహాయిస్తే, ఈ తరం కుర్రసన్నాసులెవరికీ రామచంద్రరావుగారు తెలీక పోవచ్చు. ఆయన కథల గురించీ విని వుండకపోవచ్చు. అది పెద్ద నేరమూ కాదు. ఏ నాటి వాడు రామచంద్రరావు! విశాలాంధ్ర వాళ్లు ఆయన కథల పుస్తకాన్ని 1964లో వేశారు. అంటే 56 సంవత్సరాల క్రితం. అప్పటికి ఏడంటే ఏడే కథలు రాసినాయన, తర్వాత 50 ఏళ్లలో మూడంటే మూడు కథలే రాశారు. కథా సంకలనం పేరు ‘వేలుపిళ్లై’. ఆ కథలన్నీ పాఠకుల్ని మెప్పించాయి. కవులూ, రచయితలూ, సంపాదకులూ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ‘ఈయన రచయితలకు రచయిత’ అన్నారు. నాకు బాగా నచ్చిన కథ ‘వేలుపిళ్లై’ అన్నారు నండూరి రామ్మోహనరావుగారు. తమిళనాడులోని ఒక టీ ఎస్టేటులో కూరగాయలు అమ్ముకునే చిన్న వ్యాపారి వేలుపిళ్లై. అతని భార్య గయ్యాళి. దెబ్బలాడి వెళిపోతుంది. యవ్వనంతో మెరిసే సెందామరై అతని జీవితంలోకి వస్తుంది. కూరగాయలు అమ్మీ, వండిపెట్టీ, సుఖాన్నిచ్చీ వేలుపిళ్లై జీవితానికో అర్థాన్నిస్తుంది.

‘‘బిగువైన రవికలోంచి పొంచి చూసే సెందామరై చనుకట్టూ, అప్యాయత వొలకబోసే పెదిమెల సొంపూ, మంచిచెడ్డలు ఆలోచించనివ్వని వెచ్చని కౌగిలింతా, మగతానాన్ని కలత పెట్టే పొంగు యవ్వనం అతనికి జ్ఞాపకం వచ్చాయి…’’ అని రాస్తారు రామచంద్రరావు. అగ్గిపుల్ల వెలుగులో వేలుపిళ్లై, సెందామరైని చూస్తుండటాన్ని బాపు బొమ్మ వేశారు. వేలుపిళ్లై వయసులో పెద్దవాడు. సెందామరై నవయవ్వన శృంగార దేవత!

ఆ contrast ని బాపు బొమ్మలో చూసి తరించాలి! ఎక్కడో తమిళనాడు కొండల్లో కూరగాయలు అమ్ముకునేవాడు ‘వుంచుకున్న’ ఓ ఆడదానికి- ఆ పాత్రకి గొప్ప కావ్య గౌరవం యిచ్చి ఒప్పించాడు రామచంద్రరావు. (ఇక్కడెందుకో Paulo Coelho – Eleven minutes నవల్లో బ్రెజిలియన్ బార్ డాన్సర్ మారియా గుర్తొస్తోంది).

రామచంద్రరావు చాలా అరుదైన వేటగాడు. జన్మానికో శివరాత్రి… once in a blue moon అన్నట్టు… అయిదారేళ్లకోసారి సాహితీ సముద్రం మీదికి పడవేసుకుని బయల్దేరతాడు, ఒంటరిగా. బతుకుని బిగువుగా అల్లిన వలలో… పడితే అపురూపమైన చేపే పడాలి! రాస్తే, ఆ కథ, పది కాలాలపాటు గుర్తుండిపోవాలి. ఇప్పటి దాకా ఆయన పది చేపల్ని మాత్రమే పట్టాడు. most precious things of his life and our literature.

ముందుగా కథ గుండెల్లో రూపుదిద్దుకోవాలి. దానికో ఎత్తుగడ. వాక్యం తర్వాత వాక్యం, ఒక నిజమైన సహజమైన ముగింపు…. ఇవన్నీ కుదిరాయి అనుకున్న తర్వాతే, ఆయన కాగితమ్మీద పెడతాడు. బావుంటుంది. ఐనా ఏదో లోపం… సంతృప్తియివ్వదు. మార్పులుంటాయి. రీరైట్ చేస్తాడు. ప్రతి పదాన్నీ, ప్రతి expression న్నీ ఆయన అనుకున్న ఎఫెక్ట్ వచ్చేదాకా చిత్రిక పడతాడు. ‘హమ్మయ్య’ అనుకున్నాకే ఆయన పటియాలా పెగ్ బిగిస్తాడు. శ్రీశ్రీ భాషతో వూడిగం చేయించుకున్నాడు అంటారు. రావు గారిలోనూ ఆ తత్వం వుంది. ఆయన వచనంలో వినిపించని సంగీతం, కనిపించని కవిత్వం తొంగి చూస్తాయి.

నిజానికి రావుగారు వుంచుకున్నామె పేరు వచనం. ఒకవేళ రామచంద్రరావుగార్ని మనం వేలుపిళ్లై అనుకుంటే, అతని వచనం పేరు సెందామరై!

కార్తీక పౌర్ణమి లాంటి వెలుగు వెన్నెల వచనంతో పాఠకుణ్ణి ఒక సృజన కళా సౌందర్య లోకం అంచుల్లోకి నడిపిస్తాడు. మానవ భావోద్వేగాల జడివానలో నిలువునా తడిపేస్తాడు. వాస్తవానికి గొప్ప చిత్రకారుడు కావాల్సిన మనిషి. ఆ కొండవాలుల్లోని టీ తోటల్నీ, అక్కడి పనివాళ్లనీ, చంద్రోదయాల్నీ ఆయిల్ పెయింటింగ్ లు వేయాల్సిన వాడు. ఆ Land scape నే కల్పనా చాతుర్యమూ, శిల్ప నైపుణ్యమూ కలిసిన అక్షరాలుగా మలిచి, మన ముందు పరిచి… చూడండి ఎంత ఇన్నోసెంటుగా నవ్వుతున్నాడో!

‘‘గొప్ప కథలు రాసిన టాప్ టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొ్చ్చే ఒక్క పేరు చెప్పమని అడగ్గానే, చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి.రామచంద్రరావు. రాసి కన్నా వాసికే విలువనిచ్చే అమిత మిత రచయితలలో చాసో (చాగంటి సోమయాజులు) తర్వాత సి.రామచంద్రరావుగారనే చెప్పుకోవాలి’’ అన్నారు ముళ్లపూడి వెంకట రమణ, ‘వేలుపిళ్లై’కి రాసిన ముందు మాటలో.

కావ్యాల్లాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ.

‘‘ఎన్నోయేళ్లు టీ ఎస్టేట్స్ లో ఉన్నతాధికారిగా వున్న యీ లాయర్, మేనేజర్, తెల్లదొరల నల్లదొరల మధ్య హాయిగా విహరించారు. టెన్నిస్ ఛాంపియన్ గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్లే. ఒక సోదరుడి కొడుకు- వింబుల్డన్ ప్లేయర్ మహేష్ భూపతి!

2010వ సంవత్సరం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లోని ‘సాక్షి’ దినపత్రిక ఆఫీసు, కేర్ హాస్పిటల్ మధ్య రోడ్డు డౌన్ లో ఆర్టిస్టు మోహన్ ఆఫీసు. కవీ, జర్నలిస్టూ నున్నా నరేష్, రామచంద్రరావు గారితో వచ్చాడు. మోహన్ కి పరిచయం చేశాడు. 2011లో రచయిత, ఆర్టిస్టుల మధ్య అది ప్రణయంగా మారింది. ‘‘పదరా రామచంద్రరావు గారింటికి వెళదాం’’ అనేవాడు మోహన్. నందినగర్, కేసీఆర్ ఇంటికి అవతలి రోడ్డులోనే రామచంద్రరావు గారి భవంతి. ఇంట్లోనే లిఫ్టు. రెండో అంతస్తులో ఆయన డ్రాయింగ్ రూం. పలకరింపులయ్యాక, ‘‘ప్రకాష్ హెల్ప్ యువర్ సెల్ఫ్’’ అనేవాడు. పక్క గదిలో ఫ్రిజ్ నిండా స్వదేశీ విదేశీ విస్కీలు, బీర్లు, సాఫ్ట్ డ్రింకులూ వుండేవి.
నచ్చింది తెచ్చుకోమని ఆయన సజెషన్.
పార్టీ మొదలయ్యేది.. రా.రావు ఆర్ట్ కలెక్టర్.
చాలా పెయింటింగులు వుంటాయి. వాటి గురించీ కథల గురించీ కబుర్లు. మంచి కాన్వర్ సేషనలిస్ట్. సెన్సా్ఫ్ హ్యూమర్ కి కొదవేలేదు.
పాశ్చా్త్య సంగీతమేదో వింటున్నట్టు ఇంగ్లీషు ఉచ్ఛారణ. Lively company. మేం కలిసినపుడు ఆయన వయసు 78 ఏళ్లు. సన్నగా, అందంగా కాంతులీనే మేని ఛాయతో చిరు నవ్వుల్తో హాయిగా వుంటారు. టీషర్ట్ టక్ చేసుకుని షోగ్గా, హుందాగా, ఓ మల్టీ నేషనల్ కంపెనీ సీఇవోలా వుంటారు. రచయితలా అనిపించరు. మోహన్ కామెంట్లని ఎంజాయ్ చేసేవాడు. ‘‘అసలు మీరెవరండీ, రాసినవి పది కథలు, మీరెవరికీ తెలీదు. అదే నేనైతే Millions of telugu people will recognise me with my signature’’ అన్నాడో సారి మోహన్. ‘‘ఏదో లెండి, మేం చిన్నవాళ్లం కదా’’ అని రావుగారి హంబుల్ రిపార్టీ!

ఓ సారి ఆయన మోహన్ ఆఫీసుకొచ్చారు. ఒక టేబుల్ అయిదారు కుర్చీలు, బొమ్మలు వేసుకునే తెల్ల షీట్లూ, రంగులు, బ్రష్షులూ…అంతే! నేను బ్లూరిబండ్ జిన్ తెప్పించాను. రావుగారు సిప్ చేస్తూ, బావుంది మోహన్…. “I like your bohemian way of life” అన్నారు.
నెల తర్వాత ఆయన దగ్గరకు వెళ్తే, ఖరీదైన విస్కీలు పక్కన పెట్టి జిన్ తాగుతున్నాయరాయన. మేం ఆశ్చర్యపోయాం.
మరోసారి ఆఫీసుకొచ్చి, ఆయన ఖరీదైన కార్లో నన్నూ, మోహన్నీ, టాంక్ బండ్ చివర వుండే బోట్స్ క్లబ్ కి తీసికెళ్లారు. ఆయన లోపలికి వెళ్లారు. మమ్మల్ని సెక్యురిటీ గార్డు ఆపేశాడు. నాకు అర్థమే కాలేదు. నవ్వుతూ వెనక్కొచ్చిన రావు గారు ‘‘allow them’’ అన్నారు. బూట్లు లేకపోతే లోనికి పంపరని తెలిసింది. రెండు జతల బూట్లు తెచ్చిచ్చారు. చెప్పులు బైట పెట్టి, బూట్లేసుకుని వెళ్లాం. మధ్యాహ్నం. చల్లని ఏసీహాలు. జనం దాదాపు లేరు. మంచి ఫ్రెంచి బ్రాందీ ఆర్డర్ చేశారు.రావుగారు కొత్తగా రాసిన కథ బైటికి తీశారు. డీటీపీ చేసిన కాగితాలు.
మోహన్ చదివాడు. నేనూ చదివా.
కథ మీకు ఏం అర్థమైంది? అని అడిగారు. చెప్పాను. పాయింట్ కరెక్టుగా పట్టుకున్నానని ముచ్చట పడ్డారు. ఆ కథలో మూడు చిన్న మాటల్ని మార్చి, సజెస్టివ్ గా మరో మూడు మాటలు రాసి ఆయనికి ఇచ్చాను. ‘‘…seems you are an editor’’ అని చిన్న పాజ్ యిచ్చి, ‘‘I am accepting your corrections” అన్నారు. చెప్పేదేముంది, తర్వాత బ్రాందీలో నేను నీళ్లసలు కలుపుకోనే లేదు! అది ‘సామి కుంబుడు’ అనే గొప్ప కథ. ఇలా మా స్నేహం నల్లేరు మీద చిన్న కథలా, చిత్రకళలా నడిచిపోయింది, చాలా ఏళ్లు.

ఆయనకి 80 ఏళ్లు వచ్చినపుడు అనుకుంటా, రావు గారింట్లో పెద్ద పార్టీ. హైద్రాబాద్ లోని cream of telugu literature అంతా కలిసి ఎంజాయ్ చేసింది. నిజమైన సెలబ్రేషన్ అది. ఇప్పుడాయన వయసు 88 సంవత్సరాలు. అదే అందమైన నవ్వు. చెక్కు చెదరని ఆరోగ్యం. రోజూ ఉదయాన్నే కార్లో 30, 40 కిలోమీటర్లు షామీరుపేట వెళ్లి గోల్ఫ్ ఆడతారు. కంఫర్ట్ బుల్ లైఫ్. భార్యా, కూతురూ వున్నారు. చీకూ చింతా ఏమీ లేనట్టే వుంటారాయన!

సి.రామచంద్రరావు గార్ని గనక కలవకపోతే జీవితంలో అమూల్యమైన పేజీనొక దాన్ని నేను పోగొట్టుకున్నట్టే. sound of Music లో… “Girls in white dresses with blue satin sashes, snowflakes that stay on my nose and eyelashes. Silver white winters that melt into springs… these are a few of my favorite things!” అంటూ హీరోయిన్ జూలీ ఆండ్రూస్ పాడే పాటలాగా, రావుగారు నాకు యిష్టమైన వాళ్లలో కెల్లా యిష్టమైన వాడు.

బాలగాంగాధర్ తిలక్ రాసిన ‘సిఐడీ రిపోర్టు’ కవితలో క్లర్కు అయినాపురం కోటేశ్వరరావు, చనిపోయే ముందు రోజు అడుగుతాడు. ‘‘సుఖమంటే ఏమిటి? ఎలా వుంటుంది? ఎక్కడ దొరుకుతుంది?’’ అని!

డబ్బుకి కొదవలేని upper strataకి చెందిన highly sophisticated వ్యక్తిగా, మంచి టెన్నిస్ ప్లేయర్ గా, ఆయన కావాలనుకుంటే, పొద్దున్నే హీత్రూలో దిగి వింబుల్డన్ ఫైన్సల్స్ చూసి, మారియా షరపోవాతో రెండు పెగ్గుల వైన్ తాగి, సాయంకాలానికి రోలాండ్ గారోస్ లో మెకన్రోని పలకరించి, యురోపియన్ విస్కీ రుచి చూసి, రాత్రికే షంషాబాద్ చేరుకుని ఇంటికెళ్లి రెస్టు తీసుకోవచ్చు. పారిస్ ఫైవ్ స్టార్ లో చికెన్ టిక్కా కుదర్లేదని కంప్లయింట్ కూడా చేయొచ్చు. అలాంటివి ఎన్నో చూసినవాడు. కోట్లు, విమానాలు ఆయనకి కొత్త కాదు. సుఖం ఆయనకో లెక్క కాదు.

ఏది ఏమైనా, రావుగారెన్ని ఆకాశపు అంచుల్ని తాకినా, ఆయన్ని గాఢంగా పెనవేసుకున్నవీ, మనసు పొరల్లో మెదిలేవీ, చేతులు సాచి తండ్రీ అంటూ అమృతాన్ని అందించేవీ ఆ పది కథలు మాత్రమే!

1. వేలుపిళ్లై 2. నల్లతోలు 3. ఏనుగుల రాయి 4. టెన్నిస్ టూర్నమెంట్ 5. ఉద్యోగం 6. గాళి దేవరు 7. ఫ్యాన్సీ డ్రస్ పార్టీ 8. కంపెనీ లీజ్ 9. క్లబ్ నైట్ 10. సామి కుంబుడు.
అవును. రామచంద్రరావుగారి ఆస్తి, సంపద,
రెండు చేతుల్తో పోగు చేసుకున్న
నిధి నిక్షేపాలూ… ఆ పది కథలే!

ఒకడు దశ కంఠుడు! ఒకడు దశ కథకుడు!!

ఆ పది కథల్లోనే రామచంద్రరావు జీవిస్తారు.
అదే ఆయనకిష్టం కూడా.

పిడకల వేట అను పుల్లయ్య కథ:

ఫామిలీ పార్టీలన్నిటికీ మోహన్నీ, నన్నూ తప్పక పిలిచేవారు. రామచంద్రరావుగారి ఇంట్లో ఒక మంచి పార్టీ. రావుగారి చుట్టూ పది మంది దాకా మేము. అటు ఎవరో ఒక పెద్దావిడ.. చుట్టూ ఆడవాళ్లు. స్త్రీలంతా రెడ్ వైన్ నడిపిస్తున్నారు.
గ్రేస్ ఫుల్ గా, ఉత్సాహంగా కబుర్లు చెబుతున్న పెద్దావిడ, అస్సలు ఇర్రెసిస్టబుల్. నెమ్మదిగా నేను ఆవిడ పాదాల దగ్గర
చేరాను. ఎవరు ఏంటి అని అడిగాను.
‘‘నేను పుల్లయ్య గారి కూతుర్ని’’ అని చెప్పింది. డైరెక్టరు పుల్లయ్య గారా? అంటే శాంతకుమారి కూతురా మీరు? అనడిగాను. ‘‘శాంతకుమారి మా అమ్మ’’ అని చెప్పింది గర్వంగా. పద్మ అనుకుంటా ఆవిడ పేరు. తెగ కబుర్లు చెబుతోంది. నేను జర్నలిస్టుని. గుర్తుండిపోయే సినిమా విశేషం ఒకటి చెప్పండి. Don’t disappoint me అన్నాను.

‘‘మాకో డ్రైవర్ వుండేవాడు నాన్నా’’ అని మొదలు పెట్టింది. ‘‘మా నాన్న పుల్లయ్యకి వాడు లేకపోతే గడవదు. ‘‘నా గుడిసెలో ఒక పిల్ల వుంది. దానికి చిన్న వేషం యిప్పించండి’’ అని డ్రైవరు విసిగించేవాడు. ‘‘పోరా వెధవా’’ అనేవాడు నాన్న. ‘‘వాడు వినేవాడు కాదు. ఆరు నెలల తర్వాత, పుల్లయ్య గారి సినిమా షూటింగ్. అందులో ఒక పడుచుపిల్ల చెట్టెక్కి కూచోవాలి. అలా చాలా గంటలు కూచోవాలి. ఎవరు దొరుకుతారు?’’ అని నాన్న చూస్తున్నారు. అప్పుడు డ్రైవర్ గాణ్ణి పిలిచి, ‘‘వోరేయ్. ఆ పిల్లని పట్రా’’ అన్నారు. మర్నాడు పొద్దున్నే ఆ అమ్మాయిని చెట్టెక్కించారు. చెట్టు కింద అయిదారు గంటల సేపు షూటింగ్. పాపం ఆ పిల్ల అలా కొమ్మ మీదే కూర్చుని వుంది’’ అని ముగిస్తూ ‘‘ఇంతకీ ఆ పిల్లెవరో తెలుసా నాన్నా’’ అనింది.
ఎవరు అని అడిగా.

‘‘ఇంకెవరు మన వాణిశ్రీ’’ అని చెప్పింది.

‘‘నాకు మీరు బాగా నచ్చారండీ… నాతో వచ్చెయ్ కూడదూ… పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను’’ అన్నాను. నా భుజమ్మీద ఆవిడ చెయ్యివేసి, మరో చేత్తో గ్లాసులో వైన్ పూర్తి చేసి, ‘‘నువ్వా చిన్న వాడివి. నాకు 72 ఏళ్లు. నీతో వచ్చేస్తా. నాకెలాంటి అభ్యంతరమూ లేదు, అయితే ఈయనకో మాట చెప్పు. పర్మిషన్ తీసుకో’’ అందావిడ. సోఫాలో 75 ఏళ్ల ఆయన కూర్చుని వున్నాడు… ఆమె భర్త!

నవ్వుకున్నాం అందరం
మరో రౌండ్ వైన్ పోసుకుంటూ!

Thank you for everything,
Ramchandra Rao garu…

– తాడి ప్రకాష్, 97045 41559

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

Optimized by Optimole