దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు!

భారత్‌నూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అటు.. బాధితుల సంఖ్య 21కి చేరింది. ఈ నేపథ్యంలో వేరియంట్‌ కట్టడికి కేంద్రం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది.
అటు రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలో 9 కేసులు వెలుగుచూశాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్ బయటపడింది. వారితో ఉన్న మరో ఐదుగురిని పరీక్షించగా వారికీ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒమిక్రాన్ పాజిటివ్‌ తేలిన వారిని ఆర్​యూ హెచ్​ఎస్​ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రోగుల పరిస్థితి బాగానే ఉందని.. లక్షణాలేవీ లేవని వైద్యులు తెలిపారు.
ఇక మహారాష్ట్రలో మరో 7 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. విదేశాలకు వెళ్లి వచ్చిన నలుగురు, వారిని కలిసిన ముగ్గురికి ఒమిక్రాన్​ వేరియంట్​నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితుల్లో నైజీరియా నుంచి వచ్చిన మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పుణె జిల్లా పింప్రి చించ్వాడా ప్రాంతంలోని తన సోదరుడిని కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. దీంతో ఆమె సోదరుడు, ఆయన ఇద్దరు కుమార్తెలకు సైతం ఒమిక్రాన్​ వేరియంట్​ సోకిందని వెల్లడించారు. మరోవైపు.. ఫిన్​లాండ్​ నుంచి పుణెకు గత నెల చివర్లో వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్​నిర్ధారణ అయిందని వెల్లడించారు. తాజాగా వెలుగు చూసిన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 కేసులు నమోదయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి కేసు వెలుగుచూసింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన యువకుడిలో ఈ వైరస్ కనుగొన్నారు. వెంటనే అతనిని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు. ఇంత వరకూ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన 17 మంది ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు చెప్పారు. 12 శాంపిళ్లను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు పంపామని, ఒకరిలో ఒమైక్రాన్ వేరియంట్ కనిపించిందని, అతను కొద్దిరోజుల క్రితమే టాంజానియా నుంచి తిరిగి వచ్చినట్టు తెలిపారు.

Optimized by Optimole