పార్థ సారథి పొట్లూరి:
తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కి బెయిల్ లభించింది !
10వ తరగతి హిందీ ప్రశ్నా పత్రం పరీక్ష మొదలయిన అరగంటలోపే బయటికి రావడం దానిని ఒక మాజీ జర్నలిస్ట్ బండి సంజయ్ గారికి వాట్స్ అప్ కి పంపించడం వివాదాస్పదం అయ్యి చివరకి ప్రశ్నా పత్రం బయటికి రావడానికి మూల కారకుడు బండి సంజయ్ కుమార్ అని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం తరువాత జ్యుడీషియల్ రిమాండ్ కి పంపడం జరిగింది!
ఇవేవీ కోర్టు విచారణ సందర్భంగా చట్టం ముందు నిలిచే కేసులు కావు అని పోలీసులకి తెలుసు. కాకపోతే నేరం ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడి మీదకి నెట్టి జైల్లో పెట్టడం అనే అంశం మీద చర్చిద్దాం !
బండి సంజయ్ కుమార్ brs పార్టీ వారికి చాలా ఈజీ టార్గెట్ అవుతున్నారు తరుచూ !
అక్రమ కేసులో సక్రమ కేసులో అనేవి తరువాతి విషయం కానీ తరుచూ సంజయ్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు ? కారణాలు ఏమిటో ఎపుడన్నా ఆలోచించారా ? రఘునందన్.. ఈటెల రాజేందర్..ధర్మపురి అరవింద్ ఎందుకు brs టార్గెట్ లో ఉండడం లేదు ?
అసలు తెలంగాణా బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ ఎందుకు క్రియాశీలకంగా ఉండడం లేదు ?
అయితే హైదరాబాద్ లో రాజా సింగ్ లేకపోతే కరీంనగర్ లో బండి సంజయ్ మాత్రమే తరుచూ వార్తలలో ఉంటున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు క్రియాశీలకంగా ఉండడం లేదు ?
తెలంగాణా బిజేపి పార్టీలో ఐకమత్యం లోపించిందా ?
నాకయితే ఐకమత్యం లోపించింది అనే అనిపిస్తున్నది ! మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ అవగానే అందరూ ఒకే వేదిక మీద చేరి సంఘీభావం ప్రకటిస్తూ ఆందోళనకి దిగాల్సింది పోయి.. తలా ఒక ప్రదేశం నుండి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఖండించడం అదీ ఒకరో ఇద్దరో చేయడం జరుగుతుంది. అందరూ కలిసికట్టుగా ఒకే చోట నుండి తమ సందేశాన్ని ఇవ్వడం లేదు ఎందుకు ?
తెలంగాణా రాష్ట్ర సమస్యల మీద ప్రతిస్పందించే అంశం కేవలం బండి సంజయ్ కుమార్ మీదనే ఎందుకు వేయబడుతున్నది ? ఇది ఏకపక్షంగా బండి సంజయ్ కుమార్ తీసుకుంటున్నారా లేక మిగతా నాయకులు బిజేపి స్టేట్ చీఫ్ చూసుకుంటాడు లే మనకెందుకు అంటూ దూరంగా ఉంటున్నారా లేక ఉంచబడుతున్నారా ?సమన్వయ లోపమా లేక ఐకమత్య లోపమా ?క్రెడిట్ అంతా నా ఖాతాలోకే రావాలి అనే అత్యాశ ?TSPSC ప్రశ్నా పత్రం అమ్మకాల విషయం బయట పడడానికి కారణం ఇద్దరు అభ్యర్ధుల సాహసోపేత చర్య !
TSPSC ప్రశ్నా పత్రాలని అమ్ముకుంటున్నారని బయటపడ్డా తెలంగాణా బిజేపి మొత్తం ఏకం అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించే అమూల్యమయిన అవకాశాన్ని బిజేపి పొగుట్టుకుంది అంటే నేనంటే ఒప్పుకుంటారా ?
బిజేపి నాయకత్వం కేవలం ప్రకటనలతో సరిపెట్టడం దేనికి సంకేతం? 10వ తరగతి ప్రశ్నా పత్రం అదీ హిందీ పరీక్షకి సంబంధించి బయటికి వస్తే దాని మీద బండి సంజయ్ ని అరెస్ట్ చేసి మొత్తం వ్యవహారానికి కారణం బిజేపి మీదకి తోసేసే ప్రయత్నం చేసింది brs. కానీ దానిని ముందే పసిగట్టి ఆ వలలో పడకుండా ఉండడానికి ఏం చేయాలో అది చేయకుండా అరెస్ట్ అయితే సానుభూతి వస్తుంది అనే ఆశ ఎదయితే ఉందో అది రాజకీయ వైఫల్యం అనే చెప్పాల్సి ఉంటుంది !
అసలు ఒక రాష్ట్ర బిజేపి అధ్యక్షుడికి వాట్స్ అప్ తో పని ఎందుకు ?
ఏదన్నా సందేశం ఉంటే అది బండి సంజయ్ వ్యక్తిగత సలహాదారు దగ్గర లేదా ముఖ్య అనూచరుల దగ్గర ఉంటే సరిపోతుంది ! బిజేపి లాంటి జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వాట్స్ అప్ ని మెయింటైన్ చేయడం అనే పని అవివేక చర్య లేదా రాజకీయ తప్పిదం!వాట్స్ అప్ అనేది వ్యక్తిగతంగా లేదా గ్రూపు అనేది చాలా ప్రమాదకరం అని TS లీగల్ సెల్ కి తెలియదా ? వాట్స్ అప్ ని ఎవరు ఎలా ఉపయోగించుకోవాలో సలహా ఇచ్చే వాళ్ళు రాష్ట్ర బిజేపి లో ఎవరూ లేరా ?
ఒక రాష్ట్ర బిజేపి అధ్యక్షుడి దగ్గర వాట్స్ అప్ ఉండడం నేరం కాదు. దానికి వచ్చే సందేశాలు ఎలాంటివో చూసుకొని మరీ ఆ నంబర్ ని ఇవ్వాలని సంజయ్ కి సూచిస్తున్నాను. సరే ! 10 వ తరగతి ప్రశ్నా పత్రం బయటికి వచ్చింది అని తెలిసినప్పుడు బండి అనుచరులలో ఎవరో ఒకరికి ఫోన్ చేసి చెప్పి ఆ సందేశాన్ని సంజయ్ ఇవ్వండి అని చెప్పడం ఒక పద్ధతి. కానీ నేరుగా సంజయ్ గారి వాట్స్ అప్ నంబర్ కి పంపడం అనేది అనాలోచిత చర్య అవుతుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యింది రాష్ట్ర నాయకత్వం ? నేరుగా తన నంబర్ కె సందేశాన్ని ఇచ్చేంత చనువు ఆ మాజీ జర్నలిస్ట్ కి ఎందుకు ఇచ్చారు సంజయ్ కుమార్ ?
తప్పు మీ దగ్గర పెట్టుకొని మాటి మాటికి కేంద్రం వైపు చూడడం అనేది ఉంది చూశారు అది చేతకాని తనం!
అసలు రాష్ట్ర అధ్యక్షుడు అనే వాడు ఇతర నాయకులతో పాటు కార్యకర్తలకి స్ఫూర్తిగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిoది పోయి తానె నిస్సహయ స్థితిలో కి మాటి మాటికి వెళ్ళడం రాజకీయ వ్యూహం అనేది ఏ మాత్రం లేదనే చెప్పుకోవాలి !
అరే! brs వేధిస్తుంటే ఏం చేయాలి ? అనే వాళ్ళకి ఒకటె సమాధానం : దానిని ఎప్పుడు ఎలా ఎదుర్కోవాలో వ్యూహాన్ని కలిగి ఉండడం నాయకుడి లక్షణం అది లోపించింది సంజయ్ కుమార్లో !
అదే నేనయితే నా ! అదే యోగి ఆదిత్య నాథ్ అయితేనా !
ఇలాంటి ఆనాలోచిత వ్యాఖ్యలు తరుచూ కనపడుతున్నాయి, వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా బిజేపి అభిమానులలో !
ఎవరు దేశానికి ప్రధానిగా ఉన్నా కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక్క నియంతకి తప్పితే ! దాదాపుగా 196 దేశాల చూపు మన దేశం వైపు ఉంటుంది ! మరీ ముఖ్యంగా విదేశాలలో ఉన్న దేశ పౌరులు వాళ్ళ భద్రత అనేది మన ప్రధానికి ఉంటుంది. అదే సమయంలో మన దేశ పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు ఆయా దేశాలలో ఉంటాయి. ఎలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకున్నా అవన్నీ ప్రమాదంలో పడతాయి !
మోడీజీ రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. రోజువారీ దేశ విదేశ వ్యవహారాల మీద ముఖ్యమయిన సమావేశం ఉంటుంది. ఆ విషయాలను మోడీజీ స్వయంగా పర్యవేక్షించి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయమని ఆదేశాలు ఇస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఒక రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారం అనేది ప్రధానికి అత్యంత అవసరం కాదు కాబోదు ! అది బిజేపి జాతీయ అధ్యక్షుడు అయిన నడ్డా గారు చూసుకోవాల్సిన వ్యవహారం అంతే కానీ అయిన దానికి కానీ దానికి మోడీజీ, అమిత్ షా ఏం చేస్తున్నారు అనే వ్యాఖ్యలు చేసే వాళ్ళకి బుర్రలో గుజ్జు లేదనే అంటాను !
గుజరాత్ Vs ఉత్తర ప్రదేశ్ !
గుజరాతీ ప్రజలు స్వతహాగా వ్యాపార,పారిశ్రామిక లక్షణాలని కలిగి ఉన్నారు శతాబ్దాల నుండి ! కాబట్టి అక్కడ హింస కి తావు ఇవ్వరు మరీ అత్యవసరం అయితే తప్ప ! అదే ఉత్తర ప్రదేశ్ అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్,సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ల అక్రమ సంతానం శాఖోపశాఖలుగా విస్తరించి ఉండడం వలన నేర సామ్రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది ! యోగి ఆదిత్యనాథ్ ఆ నేర సామ్రాజ్యాన్ని నరుక్కుంటూ వస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా యోగి పాత్ర ఉత్తర ప్రదేశ్ కి పరిమితం అవుతుంది తప్పితే అది విదేశాలకి సంబంధించినది కాదు !
ఒక వేళ యోగి ఆదిత్యనాధ్ ప్రధాని అయినా ఇప్పుడు మోడీజీ ఎలా వ్యవహరిస్తున్నారో అలాగే వ్యవహరించాల్సి ఉంటుంది తప్పితే తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుల్ డోజర్లు నడిపించలేరు అన్నది గుర్తెరిగి ఉండండి !
ఇక బెంగాల్ లో కానీ తెలంగాణా లో కానీ ఏదన్నా జరిగితే వెంటనే రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టడం లేదన్న తెలివితక్కువ వ్యాఖ్యలు ఎక్కువగా బిజేపి అభిమానులే చేస్తున్నారు.
SR బొమ్మై Vs యూనియన్ గవర్నమెంట్ కేసులో అప్పటి సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఆర్టికల్ 370 ని ఉపయోగిస్తూ వివిధ రాష్ట్రాలలో ఏ సందర్భాలలో రాష్ట్రపతి పాలన విధించాలో చాలా స్పష్టమయిన మార్గదర్శక సూత్రాలని వివరించింది. వాటిని కాదని రాష్ట్రపతి పాలన విధిస్తే అది ఎదురు తన్నుతుంది !
ఏదన్నా రాష్ట్ర పరిధిలో అదుపు చేయలేనంతగా హింస ప్రజ్వరిల్లి నప్పుడు దానిని రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలి ! అంతే కానీ బిజేపి ని అణిచివేస్తున్నది అని చెప్పి రాష్ట్రపతి పాలన విధించడం కుదరదు!
జరాసంధుడి బారి నుండి తన ప్రజలని రక్షించుకోవడం కోసం శ్రీ కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించి అక్కడికి తన ప్రజలని తరలించాడు ! అలా అని జరాసంధుడిని తన సుదర్శన చక్రంతో సంహరించలేదు శ్రీ కృష్ణుడు ! దానికి భీముడిని వినియోగించాడు తన మార్గ దర్శకత్వం తో ! భారతంలో జరాసంధుడి వధ ని చదివితే సూక్ష్మం అర్ధం అవుతుంది!
ప్రతి దానికి మోడీజీ లేదా అమిత్ షా వైపు నిస్సహాయంగా చూస్తూ కూర్చుంటే తెలంగాణాలో బిజేపి ఎప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు ! ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బలంగా ఉంటూ అదనపు బలగాలు కావాలంటే కేంద్రం పంపిస్తుంది కానీ మీకంటూ ఒక బలగం ని సృష్టించుకోకుండా ఉన్నారు అంటే లోపం మీలోనే ఉంది సంజయ్ కుమార్ !
అసలు బిజేపి కి తెలంగాణాలో బలం ఉన్నదీ అంటే అది బిజేపి, rss కార్యకర్తల వల్లనే ! వీళ్ళ బలంతోనె నాయకులు తయారయ్యారు తప్పితే వాళ్ళ స్వంత బలంతో కానే కాదు !
అసలు ఈ పాటికే తెలంగాణా బిజేపి అధ్యక్షుడి మీద చేయి వేయాలంటే భయం పుట్టెట్లు గా ఉండాలి కానీ చాలా తేలికగా టార్గెట్ చేయబడుతున్నారు బండి సంజయ్ కుమార్ ! ఎక్కడ ఉంది లోపం ?
పాండవులకి అన్యాయం జరిగింది అని అందరూ ఏకపక్షంగా పాండవుల వైపు చేరి కురుక్షేత్రం లో పాల్గొనలేదు ! అంటే సానుభూతి అనేది అప్పట్లోనే వర్క్ అవుట్ అవ్వలేదు. ఈ రోజుల్లో సానుభూతి వర్క్ అవుట్ అవుతుంది అనే ఆలోచనలో ఎవరన్నా ఉంటే అంతకంటే తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు !
ఇదేంటిరా ? చీటికి మాటికి సంజయన్న అరెస్ట్ అవుతున్నాడు అంటూ కార్యకర్తలలో అసహనం ఇప్పటికే మొదలయ్యింది సంజయ్ గారు ! BRS కాకపోతే ఇంకో పార్టీ ఉన్నా ఇదే విధంగా చేస్తుంది రాజకీయం ! దానిని ఎదుర్కోవాలి,ఎత్తుకు పై ఎత్తు వేయాలి అప్పుడే బలంగా ఉండగలుతారు !ముందు కమ్యూనికేషన్ వ్యవస్థని ఎలా వాడుకోవాలో నేర్చుకోండి ! తరువాత KCR లాంటి బలమయిన ప్రత్యర్ధిని ఎదుర్కోవచ్చు !ముందు రఘునందన్ రావు,ఈటెల రాజేందర్ ,ధర్మపురి అరవింద్ కలుపుకొని పోరాటం చేయండి. అంతే కానీ ఎవరు వారు యమునా తీరే అన్న చందంగా నేనొక్కడినే పోరాడుతాను అంటే దానికి ఒక జీవితం సరిపోదు !
‘’నాయకుడు అంటే ముందు ఉండి నడిపించాలి ‘’! అంతే కానీ ముందు ఉండి నడుస్తాను నా వెనక అందరూ రండి అంటే అది నడక పోటీ అవుతుంది తప్పితే రాజకీయం కాదు !
శ్రీకృష్ణుడు ఆయుధం పట్టకుండా ముందు ఉండి కురుక్షేత్రాన్ని నడిపాడు ! నాయకుడి లక్షణం ఎలా ఉంటుందో ఒకసారి మహా భారతం చదివితే అర్ధం అవుతుంది !
జైహింద్ ! జై భారత్ !