వైసీపీ వైరస్ కు జనసేన, తెలుగుదేశమే వ్యాక్సిన్: పవన్ కళ్యాణ్

Varahivijayayatra4: ‘ప్రజల దాహం తీర్చే గ్లాసు… ఆ ప్రజలను గమ్యం చేర్చే సైకిల్ ఒక్కటయ్యాయి. కరెంటు ఛార్జీల దెబ్బకు ఫ్యాను తిరగడం ఆగిపోయింది… రాష్ట్ర అభివృద్ధి ఆ ఆగిపోయిన ఫ్యానుకు ఉరి వేసుకుంది’ అని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  అన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైసీపీ మహమ్మారికి జనసేన- తెలుగుదేశం పార్టీలే వ్యాక్సిన్ గా పని  చేస్తాయని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన, తెలుగుదేశం కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఆలయాలను కూల్చేసే వైసీపీ మహమ్మారికి… పురోహితులను వేలం వేసే వైసీపీ మహమ్మారికి… రైతాంగాన్ని కన్నీరు పెట్టిస్తోన్న వైసీపీ మహమ్మారికి.. నిరుద్యోగులను నిలువునా ముంచేసిన వైసీపీ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని  పిలుపునిచ్చారు. వారాహి విజయయాత్ర నాలుగో విడతను ఆదివారం ఆయన అవనిగడ్డలో బహిరంగసభ ద్వారా మొదలుపెట్టారు. అశేష సంఖ్యలో ప్రజానీకం ఈ సభకు హాజరయ్యారు. జనసేన, టీడీపీ శ్రేణులు.. పవన్ కళ్యాణ్ ని ఘనంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా సభలో  జనసేనాని  ప్రసంగిస్తూ “రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం జనసేన – తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తాయి. సంకీర్ణ ప్రభుత్వం స్థాపించి తీరుతామన్నారు. జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని.. 175కు 175 గెలుస్తామని మాట్లాడుతున్నాడని .. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 15 సీట్లు వస్తే గొప్పని ఎద్దేవ చేశారు.రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ కూడా బింకాలు పలికేవాడని …యుద్ధంలో జర్మనీ గెలుస్తుందని చివరి వరకు ప్రజలను నమ్మించాడని .. ప్రత్యర్థి దేశాల దళాలు బెర్లిన్ చేరుకోగానే బంకర్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని ..2024లో జగన్ పరిస్థితి కూడా అంతేనని పవన్ స్పష్టం చేశారు.

కురుక్షేత్రంలో వైసీపీ నేతలే కౌరవులు..

వచ్చే ఎన్నికలను కురక్షేత్ర యుద్ధంతో ముఖ్యమంత్రి పోలుస్తున్నాడని పవన్ అన్నారు.  కురుక్షేత్రంలో కౌరవులో, పాండవులో తేల్చుకోండని ..151 మంది మీరున్నారు కాబట్టి కచ్చితంగా వైసీపీ వారే కౌరవులే అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అలా కాకుండా జగన్ – కింగ్ జేమ్స్ బైబిల్ ను నమ్మితే ఒక విషయం గుర్తు చేస్తున్నానని.. ‘‘డేవిడ్ అండ్ గొలాయక్’’ కథలోని అహంకారపూరితమైన గొలాయక్ – 14 ఏళ్ల గొర్రెల కాపరి డేవిడ్ చేతిలో ఎలా చనిపోయాడో గుర్తుంచుకుంటే మంచిదన్నారు . జగన్ ఎన్ని కుయుక్తులు, పన్నాగాలు పన్నినా వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. జగన్ గద్దె దిగడం డబుల్ ఖాయమని… నిరుద్యోగులకు వచ్చే కొత్త ప్రభుత్వంలో న్యాయం జరగడం త్రిబుల్ ఖాయమని.. జగన్ ఏ కథ తీసుకున్నా పర్వాలేదని…. దానిలో ఓడిపోయే క్యారెక్టర్ మాత్రం జగన్ దేనని పవన్ తేల్చి చెప్పారు.

డీఎస్సీ అభ్యర్థుల వేదన వింటే బాధ కలుగుతోంది..

అవనిగడ్డ ప్రాంతం ఒకప్పుడు డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు వేదికగా ఉండేదన్నారు పవన్. ఇక్కడ ఉండే సుమారు 80 నుంచి 100 శిక్షణ కేంద్రాలు అభ్యర్థులతో కళకళలాడేవని.. ప్రస్తుతం డీఎస్సీ అభ్యర్థుల వేదన చూస్తే బాధగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. 2018 నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ లేదని.. అదిగో ఇదిగో అంటూ రకరకాల మాయమాటలు చెబుతూ యువత జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. 50 వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని అభ్యర్థులు చెబుతున్నారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల విలీనం పేరుతో రకరకాల ప్రయోగాలు చేశారు తప్పితే డీఎస్సీ ద్వారా ఒక్క ఉపాధ్యాయుడినీ నియమించలేదన్నారు. డీఎస్సీ కోసం ఎన్నో కలలు కన్న యువతకు వయసు మీరిపోతోందని జనసేనాని వాపోయారు.

 

Optimized by Optimole