భారీ మెజార్టీతో బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించండి: పవన్ కళ్యాణ్

Telanganaelection2023: ఆంధ్రలో రౌడీలు రాజ్యాలేలుతున్నారని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.రౌడీలను, గూండాలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొని నిలబడి ఉన్నానంటే దానికి ముఖ్య కారణం తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తేనని ఆయన స్పష్టం చేశారు.ధన బలం లేకపోయినా గుండె ధైర్యం, ఆశయ బలం ఉంటే ఏదైనా సాధించవచ్చునని ఈ నేల నేర్పిందన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అవినీతి, కమీషన్ల తెలంగాణగా మారిపోవడం చూసి బాధ కలిగింద”ని జనసేనాని ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని, ఇక్కడి యువత బంగారు భవిష్యత్తు కోసం నా వంతు కృషి, పోరాటం చేస్తానని తేల్చిచెప్పారు. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో … వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో అలాగే తిరుగుతానని తెలిపారు. ఏ మార్పు కోరుతూ తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేశారో… అది సాధించి తీరుతామన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, జనసేన నాయకుల విజయాన్ని కాంక్షిస్తూ హనుమకొండలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల నుంచి  రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్ రావులను భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. 

కాగా సభ వేదిక నుంచి పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “ఎన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదురైనా దశాబ్ద కాలంగా జనసేన పార్టీని స్థిరంగా ముందుకు నడుపుతున్నామంటే దానికి కారణం తెలంగాణ నేల నేర్పిన పోరాట స్ఫూర్తి అని పవన్ కొనియాడారు. ఈ వరంగల్ నేల ఎంత గొప్పదంటే “పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది” అని నినదించిన ప్రజా కవి కాళోజీ, “నా తెలంగాణ.. కోటి రత్నాల వీణ” అని  రాసిన దాశరధి వంటి మహానుభావులకు జన్మనిచ్చిన నేల అని గుర్తు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీని ప్రధానమంత్రిగా చూడాలని ఆకాంక్షించి 2014లో ఈ నేల నుంచే మద్దతు తెలిపానని.. ఆయన ప్రధాన మంత్రి అయ్యారని పవన్ పేర్కొన్నారు.