వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 పై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష నేతల్ని అడ్డుకునేందుకు బ్రిటీష్ కాలం నాటి చీకటి జీవోను సీఎం జగన్ అమల్లోకి తెచ్చారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ దుందుడుకు చర్యలకు దిగుతూ.. ఇలాంటి చెత్త జీవోలు తీసుకువస్తోందన్నారు. సీఎం జగన్ అరాచక విధానాలపై ఏ విధంగా సంయుక్త పోరాటాలు చేయాలనే అంశం మీద టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించినట్టు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్య గళం వినిపించాలని నిర్ణయించుకునట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే కుప్పం ఘటన నేపధ్యంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపినట్లు పవన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం.. చంద్రబాబుని సొంత నియోజకవర్గంలో తిరగనివ్వకపోవడం, ప్రతిపక్ష నేతగా ఆయన హక్కుల్ని కాలరాయడమేనని తేల్చిచెప్పారు. సంఘటన జరిగిన రోజు ప్రకటన ద్వారా సంఘీభావం తెలియచేశానన్నారు. ఇప్పుడు నేరుగా సంఘీభావం తెలిపేందుకు వచ్చానన్నారు. వైసీపీ ఆరాచకాలపై మిత్రపక్షం బీజేపీతో కూడా చర్చిస్తామని పవన్ స్పష్టం చేశారు.