APpolitics:‘2024లో ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు ఉండాలనే బలమైన సంకల్పంతోనే పొత్తు నిర్ణయం తీసుకున్నాంమన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. రాజ్యాధికారం అనే రక్తం మరిగిన వైసీపీ నాయకుడిని ఇంటికి పంపిచడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వైసీపీ ఎన్నికల ముందు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని.. ఇప్పటికే రాష్ట్రంలో 26 లక్షల పైచిలుకు దొంగ ఓట్లు బయటపడ్డాయని తెలిపారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని తేల్చిచెప్పారు. గెలుపు నిష్పత్తి బట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయిద్దామ’ని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
సోమవారం మచిలీపట్నంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “వైసీపీ నాయకుడు డ్రాకులా మాదిరిగా అధికారానికి అలవాటుపడ్డాడని.. దానిని వదులుకోవడానికి సిద్ధంగా లేడని.. జగన్ ను టీనేజ్ నుంచి గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. కడప జిల్లాలో ఒక పోలీస్ అధికారిని లాకప్ లో వేసి దాడి చేసిన నైజం అతనిదని.. జగన్ స్వభావం కూడా అత్యంత దూకుడు, దుర్మార్గంగా ఉంటుందని చాలా మంది సన్నిహితులు చెప్పేవారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో జగన్ బ్యాచ్ చేసిన దోపిడీ అంతాఇంతా కాదన్నారు. వారి దోపిడీని భరించలేక తెలంగాణ యువత తిరుగుబాటు చేసిందన్నారు. ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు హానికరమని భావించే మొదటి నుంచి వైసీపీ ఆంధ్రప్రదేశ్ కు హానికరమని చెబుతున్నానని.. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ప్రత్యక్షంగా అతను పెడుతున్న బాధలు అనుభవిస్తున్నారని పవన్ ధ్వజమెత్తారు.
జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే బలమైన సీట్లు సాధించేదని.. అయితే అధికారం సాధించేందుకు మన బలం సరిపోతుందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం లేదన్నారు పవన్. ప్రజలు సైతం జనసేన పార్టీని నమ్ముతున్నప్పటికీ అధికారం సాధించే దిశగా పార్టీ ప్రయాణం చేస్తుందా? లేదా? అనే సందేహంలో ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ద్వారా కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తామనే నమ్మకం ప్రజల్లోనూ కలిగిందన్నారు. జగన్ లాంటి వ్యక్తిని ధీటుగా ఎదుర్కొవాలంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే కచ్చితంగా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిని ప్రజలు కూడా ముక్త కంఠంతో ఆమోదిస్తున్నారని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
సహకారం, సంఘర్షణ రెండు కీలకమే..
రాజకీయాల్లో అవసరం మేరకు కలుస్తామని జన సేనాని స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం పార్టీతో గతంలో విభేదించిన మాట వాస్తవమేనని.. రాజధానికి 33 వేల ఎకరాలు ఒకేసారి సేకరించే విషయంపై విభేదించినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ నగరం మాదిరి అంచలంచెలుగా ఎదగాలని భావించానని అన్నారు. క్రమక్రమంగా రాజధాని ఉన్నత దశకు వెళ్తుందని నమ్మినట్లు.. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ విధానం విషయంలో విభేదించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం అంధకారంలోకి వెళ్లిపోతున్న ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకోవడం కోసం పరస్పర సహకారం అవసరమని.. రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయన్నారు. ముఖ్యంగా సహకారం, సంఘర్షణ కీలకమని.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భావి భవిష్యత్తు బాగుండాలి అంటే సహకారం అవసరమని కుండ బద్దలు కొట్టారు. 2024లో సహకరించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. దీనివల్ల జనసేన ఎదుగుతోందని.. తెలుగుదేశం స్థిరపడుతుందని.. ఇంకా తమతో కలిసి పని చేయాలనుకునే వారిని కూడా కలుపుకొని వెళ్తామని పవన్ చెప్పకనే చెప్పారు.