Varahivijayayatra: ఏపీ లో స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓటు వేసిన పాపానికి ఆంధ్రా ప్రజలను కాటు వేసిన జగన్..హామీలు అడిగితే అంగన్వాడీలను కొట్టించారని ఆయన మండిపడ్డారు.వారాహి విజయయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజల సమాచారం ఎందుకు పక్క రాష్ట్రం హైదరాబాద్ లోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఉన్న ‘‘ఎఫ్ఓఏ’’ అనే ఏజెన్సీ వద్ద ఉంది..? ప్రజల డేటాను సేకరించి అక్కడకు ఎందుకు పంపిస్తున్నారు..? దీనికి సీఎం జగణ సమాధానం చెప్పాలని?పవన్ డిమాండ్ చేశారు.
కాగా ‘‘ఎఫ్ఓఏ’’ ఏజెన్సీలో పనిచేస్తున్న 700 మంది సిబ్బంది ప్రజల డేటాతో ఏం చేస్తున్నారు..? అసలు వారికి జీతాలు ఇస్తుంది ఎవరు..? దాని నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు..? అసలు అక్కడకు ప్రజల డేటాను పంపి మీరు ఏం చేయదల్చుకున్నారు..? జగన్ వింటున్నావా.. సమాధానం చెప్పు?అని జనసేనాని నిలదీశారు.
ఇక 1859లో మొదలు పెట్టి, ప్రపంచమంతా విస్తరించిన సామాజిక సేవా సంస్థ రెడ్ క్రాస్ లాంటి వాలంటీరు సంస్థకే భారతదేశ చాప్టర్ కు భారత రాష్ట్రపతి, రాష్ట్రాలకు గవర్నర్లు బాధ్యత తీసుకుంటారు. మరి నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాధనం ఖర్చు చేసి మరీ పని చేయిస్తున్న వాలంటీర్లపై ఎవరు బాధ్యత తీసుకుంటారు..? అసలు ఈ వ్యవస్థకు అధిపతి ఎవరు..? కొందరు వాలంటీర్లు చేస్తున్న అసాంఘిక పనులు, నేరాలకు నువ్వు బాధ్యత తీసుకుంటావా లేదా..? ప్రజలకు వివరించు జగన్..? అంటూ పవన్ నిలదీశారు.
అటు రాజకీయ కారణాలతో 26 మంది ఆడపడుచులకి దక్కాల్సిన సంక్షేమ పథకాలను వాలంటీర్లు… తొలగిస్తే వారు న్యాయం చేయాలని గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి జస్టిస్ బట్టు దేవానంద్ గారు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వాళ్లకు వ్యక్తిగత సమాచారం తీసుకునే లీగల్ అథారిటీ ఎక్కడిది? ఎవరిచ్చారు..? ఇంతమంది ప్రభుత్వ అధికారులు ఉండగా వీళ్లే ఎందుకు సమాచారాన్ని సేకరిస్తున్నారు? వ్యక్తిగత డేటా చోరీ అయితే బాధ్యత ఎవరు వహిస్తారు? అని గౌరవ ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సమాధానం ఎక్కడ జగన్..? వ్యక్తిగత డేటా చోరీ అయితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహిస్తాడా? 151 మంది ఎమ్మెల్యేలు వహిస్తారా? లేకపోతే 30 మంది ఎంపీలు వహిస్తారా? అని ప్రశ్నించిన గౌరవ కోర్టుకు చెప్పే దమ్ముందా జగన్..? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం ప్రజలకు చెప్పు జగన్.. వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా అడుగుతున్న కీలకమైన సందేహాలను నివృత్తి చేయ్ జగన్ అంటూ జనసేన అధినేత ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ప్రశ్నలు సంధించారు.