Janasenavarahi: ఏపీ రాజకీయాల్లో మార్పు కోసం… ఓ నూతన అధ్యాయం నిర్మాణం కోసం… ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు వారాహి యాత్రను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన నుంచి ప్రారంభించబోతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ‘‘సకల శుభాలనిచ్చే అన్నవరం సత్యదేవుడి దర్శనం చేసుకుని, ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని వారాహి యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం. అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర ఉంటుంది. కేవలం ఎన్నికల కోసం మాత్రమే యాత్ర కాదు. ప్రజల బాధలను దగ్గరగా తెలుసుకునేందుకు, వారితో మమేకం అయ్యేందుకు ఇదో చరిత్రలో నిలిచిపోయే యాత్ర కాబోతోంది. ప్రతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు ఉండేలా ప్రణాళిక తయారు చేసుకున్నాం. 11 నియోజకవర్గాల్లో మొదటిగా యాత్ర జరగబోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంతో మొదలుపెట్టి, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో యాత్ర రూట్ మ్యాప్ ను స్థానిక పార్టీ నేతలు చర్చించి ఖరారు చేస్తారు. ప్రతి నియోజక వర్గంలో వారాహి నుంచి ప్రజలని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని మనోహర్ పేర్కొన్నారు.
వినతులు స్వీకరిస్తూ… క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ…
ప్రజల సమస్యలు వింటూ, వాటిని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, సమస్యలతో సతమతమవుతున్న బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ యాత్ర సాగేలా ప్రణాళిక ఉంటుందన్నారు మనోహర్. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రజా వినతులు స్వీకరించి, స్థానికులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతారన్నారు. అనంతరం పార్టీ నాయకులు, వీర మహిళలతో పార్టీ బలోపేతం మీద పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఆయా నియోజవర్గాల్లోని కార్మిక, రైతు వర్గాలు, చేనేత, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, డ్వాక్రా మహిళలు, స్థానికంగా ఉండే అన్ని వర్గాలవారితోనూ జన సేనాని మాట్లాడుతూ ముందుకు వెళతారని మనోహర్ చెప్పుకొచ్చారు.