దేశ ప్రతిష్టతను దిగజార్చేందుకు కొన్ని విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం అసోంలోని సొంటిపూర్ జిల్లాలో టీ కార్మికులు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని పరిశ్రమల గురించి బయటి శక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, అలాంటి వారికి మద్దతు తెలిపే రాజకీయ పార్టీలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని మోదీ పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం 8 వేల కోట్లతో తలపెట్టిన ‘అసోంమాల’ పథకాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న సమస్యను అనుకూలంగా మార్చుకొని దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు విదేశీయులు కుట్రలు చేస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని కొన్ని ప్రభుత్వ నివేదికల ద్వారా బహిర్గతమైందని ఆయన వెల్లడించారు. అసోంలో గత ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. వైద్య ఆరోగ్య, మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.