భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి కాబోతోంది. ఈనేపథ్యంలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఖాతా ప్రోఫైల్ పిక్చర్ జాతీయ జెండా పెట్టుకోవాలని కోరారు. ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు ఉద్యమంలా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ ఉధమ్ సింగ్ కూ ప్రధాని నివాళులర్పించారు.
కాగా మూడు రోజులు.. ప్రతి ఇంటి వద్ద జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మనమందరం ఒక అద్భుతమైన, చరిత్రాత్మకక్షణాన్ని అస్వాదించబోతున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.ప్రతి ఒక్కరూ ఈఉత్సవాల్లో తప్పకుండా పాల్గొనాలని ప్రధాని అభ్యర్థించారు.
ఇక దేశంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం సాముహిక ఉద్యమంగా మారిందన్నారు ప్రధాని.ఈ కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలో ‘అమృత భారతి కన్నడర్తి’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. 75 ప్రదేశాల్లో.. ఆయా ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల్ని స్మరించుకుంటూ కార్యక్రమాల్ని నిర్వహించినట్లు ప్రధాని వెల్లడించారు. అంతేకాక స్వాతంత్ర్య పోరాటంలో రైల్వేల ప్రాముఖ్యతను వివరిస్తూ ‘ఆజాదీ కా రైల్‌గాడీ’ పేరిట 75 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు ప్రధాని స్పష్టం చేశారు.