APPOLITICS : పోలవరం పై ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ రాజ్యసభ సభ్యులు డా. కేవిపి రామచంద్ర రావు లేఖ రాశారు. జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కేవీపీ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ఈనాడు అనాధ లా మిగిలిపోయిందన్నారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించకపోవడం వల్ల సముద్రం లోకి వృధాగా పోయే 300 పైగా టిఎంసి ల నీటిని వినియోగంలోకి తెచ్చే ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు ను అత్యంత ప్రజా ప్రాధాన్యత గల ప్రాజెక్టు గా కేంద్రమే నిర్మించి, 2018 నాటికి పూర్తి చేయాలని విభజన చట్టం చెప్పిందని గుర్తు చేశారు. 2018 నాటికి పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి అవుతుందో జ్యోతిష్కులు, చిలకజోస్యగాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంట్రాక్టర్లు ఇంజనీర్లు చేయవలసిన పనిలో రాజకీయ జోక్యం వల్ల ప్రస్తుతం పోలవరం ప్రధాన డ్యామ్ పనులు గత మూడు సంవత్సరాలుగా ఆగిపోయాయని లేఖలో కేవీపీ పేర్కొన్నారు.