తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. గెలుపు పై ఇటు టీఆర్ఎస్ ,అటు బీజేపీ నేతలు ధీమాతో కనిపిస్తున్నారు. పోటిలో కాంగ్రెస్ ఉన్నప్పటికి అది నామమాత్రంగానే పరిగణించవచ్చు.ఫలితాలకు మరో కొద్దిగంటల సమయం మాత్రమే ఉండటంతో పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈనేపథ్యంలో బెట్టింగ్ వ్యవహారంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.ఓటుకు నోటు పోటెత్తిన ఈ ఉప ఎన్నికలో బీజేపి గెలుస్తుందని కొంతమంది పందెలా కాస్తుండగా .. మరికొంతమంది టీఆర్ఎస్ గెలుస్తుందని వేలల్లో పందెలా కాస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మునుగోడులో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాలోనూ ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్లు వివిధ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
గెలుపుపై ఇరుపార్టీ నేతల ధీమా..
ఇక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటిచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం విజయంపై ధీమావ్యక్తం చేస్తోంది.నియోజకవర్గ అభివృద్ధి కోసం తమ నేత చేసిన పదవి త్యాగం వృథాకాలేదని అన్నారు. అభివృద్ధి పట్టని.. ప్రజాసమస్యలను గాలికొదిలేసి ఫాంహౌజ్ కి పరిమితమైన సీఎం కేసీఆర్ నూ.. నియోజకవర్గానికి రప్పించిన ఘనత రాజగోపాల్ రెడ్డిదని కొనియాడారు.కౌరవసేన మాదిరి టీఆర్ఎస్ నేతలు నియోజకవర్గానికి దండెత్తి వచ్చారని .. అయినప్పటికి సింహం సింగిల్ మాదిరి రాజగోపాల్ ఒంటరిగా ఎదుర్కొని మునుగోడు గడ్డపై కాషాయ జెండా ఎగరవేయబోతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచక పర్వం కొనసాగించందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు మాత్రం రాజగోపాల్ వెంటే ఉన్నారన్నారు. కేసీఆర్ అహంకారం అణించేందుకు మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈసీన్ రిపీట్ అవ్వడం ఖాయమని ఘంటపథంగా చెబుతున్నారు.
అటు అధికార టీఆర్ఎస్ అభ్యర్ఠి కూసుకుంట్ల వర్గీయులు సైతం గెలుపుపై ధీమాగా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసంగా ఉంచారన్నారు. ప్రభుత్వ పథకాలు తమ గెలుపునకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.ఆరునూరైనా ఉప ఎన్నికలో కారుజోరు చూపడం ఖాయమంటున్నారు.రాజగోపాల్ స్వార్థం కోసమే రాజీనామా చేశారని.. ప్రజలు ఈవిషయాన్ని గుర్తించి అద్భుత తీర్పు ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు. ఉప ఎన్నికతో పాటు మూడోసారి అధికారం తమ పార్టీధేనని కారు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంమీద డబ్బుల వర్షం కురిసిన ఉప ఎన్నికలో గెలుపుపై ఇటు బీజేపీ ,అటు టీఆర్ఎస్ నేతలు ధీమాతో ఉండగా.. అదే తరహాలో ఫలితాలపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది.ఈగెలుపు అన్ని పార్టీలకు చావోరేవో కానున్న నేపథ్యంలో పార్టీ నేతలు.. కార్యకర్తలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.