రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు విచారణలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్ షాట్స్ యాప్ ను తొలగించడంతో.. కుంద్రా ప్లాన్-బి అమలుకు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. బాలీఫేమ్ పేరుతో మరో యాప్‌ను ఏర్పాటు చేసి దందాను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ యాప్ వినియోగానికి ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారి పేరు మీద.. అతడికి తెలియకుండానే భాగస్వామిని చేసినట్లు తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న కుంద్రా సన్నిహితుడు యష్ ఠాకుర్ ముందస్తు ప్రణాళికతో ఆ అధికారితో స్నేహ సంబంధాలను ఏర్పర్చుకుని.. అవార్డులు గెలుచుకున్న లఘు చిత్రాలను ప్రసారం చేసేందుకు యాప్‌ను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదనతో.. అతని భార్య పేరు మీద బాలీఫేమ్ యాప్‌ను రిజిస్టర్ చేశాడని పోలీసల విచారణలో వెల్లడైంది. అయితే ఆ యాప్‌లో అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేయడంతో సదరు ఐబీ అధికారి అభ్యంతరం తెలిపినట్లు.. కుంద్రా అరెస్టైన మరుసటి రోజు ఆ యాప్ నుంచి పోర్న్ చిత్రాలను తొలగించమని ఆ అధికారి చెప్పినట్లు ఈ కేసులో సాక్షులుగా మారిన కుంద్రా సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు తెలిపారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా నటి షెర్లిన్ చోప్రాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. దీంతో విచారణలో ఇంకెంత మంది ప్రముఖుల పేర్లు బయటికి వస్తాయో అని బీ_టౌన్ లో చర్చ జరుగుతోంది.
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ…
రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. అంతేకాక కుంద్రాకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. దీంతో అతడి నుంచి పోలీసులు మరింత సమాచారం సేకరించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే కుంద్రా సతీమణి, ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి ఈ కేసు విషయంలో ఇంకా క్లీన్ చిట్ లభించలేదని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. “ఈ కేసులో శిల్పాశెట్టికి ఇంకా క్లీన్ చిట్ లభించలేదు. ఫోరెన్సిక్ ఆడిటర్లు బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. హాట్షాట్ యాప్ ప్రదీప్(కుంద్రా బావమరిది) పేరు మీదే ఉన్నా.. దీని మొత్తం వ్యవహారాన్ని రాజ్కుంద్రానే చూస్తున్నారు. కుంద్రా అరెస్టు తర్వాత పలువురు మా వద్దకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కేసు విషయంలో రూ.6 కోట్ల విలువ గల అరవింద్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలను నిలిపివేశాం. తన ఖాతాలను అతడు పునరుద్ధరించాలని కోరినా.. మొదట పోలీసులు ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించాం అని ముంబయి క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు.