PawanKalyan: 2024 ఏపీ ఎన్నికల్లో ‘కే’ ఫ్యాక్టర్‌ అంటే కాపు ఫ్యాక్టర్‌ అని నిరూపిస్తున్న పవర్‌ స్టార్‌..

Nancharaiah merugumala senior journalist:

” 24 సీట్లకు బేరమాడిన పవన్‌ కల్యాణ్‌ పై కాపు ఆలోచనపరులది అధర్మాగ్రహం!2024 ఏపీ ఎన్నికల్లో ‘కే’ ఫ్యాక్టర్‌ అంటే కాపు ఫ్యాక్టర్‌ అని నిరూపిస్తున్న పవర్‌ స్టార్‌.. “

మొదటి నుంచీ పశ్చిమ గోదావరి జిల్లాలో మూలాలున్న కొణిదెల కుటుంబం అంటే గోదావరి సహా కోస్తా జిల్లాల కాపు సోదరులకు ఎందుకో చులకన భావం. చిరంజీవి, పవన్‌ కల్యాణ్, రామ్‌ చరణ్‌ వంటి మెగాస్టార్లను, వరుణ్‌ తేజ్‌ వంటి యాస్పైరింగ్‌ హీరోను అందించిన ఈ కొణిదెల ఇంటిపేరున్న కుటుంబం అసలు కాపులేనా అంటూ ఎగతాళి చేసిన రోజులున్నాయి. దేశంలోనే అతిపెద్ద వైద్య వ్యాపార దిగ్గజం అపోలో ప్రతాప్‌ సీ రెడ్డి గారు, నిజామాబాద్‌ జిల్లా దోమకొండ సంస్థానానికి (జమీందారీ వంటిది) చెందిన దివంగత రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కామినేని ఉమాపతి రావు గారి మనవరాలు ఉపాసనా కామినేనికి చిరంజీవి గారి ఒకే ఒక్క కొడుకు రామ్‌ చరణ్‌ భర్త అయ్యాకే భూస్వామ్య పోకడలున్న కాపు బుద్ధిజీవుల, పాత్రికేయులు కొణిదెల కుటుంబానికి కాస్త మర్యాద ఇవ్వడం మొదలెట్టారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించిన చిరంజీవి 2009 ఎన్నికల్లో పోటీచేశారు. పీఆర్పీకి మొత్తం 294 సీట్లలో 18 అసెంబ్లీ స్థానాలు, పోలైన ఓట్లలో 18 శాతం దక్కాయి. ఎన్టీఆర్‌ తెలుగుదేశం మాదిరిగా పీఆర్పీని ఏడు నెలల్లో పాలకపక్షంగా మార్చేద్దామనుకున్న చిరంజీవి కోరిక నెరవేరలేదు. ఆంధ్రా కాపులకు మొదట్నించీ లవ్‌ అండ్‌ హేట్‌ సంబంధబాంధవ్యాలున్న భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో పీఆర్పీని ఆయన విలీనం చేసి చేతులు దులుపుకుని కాళ్లు కడిగేసుకున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశం మేరకు చిరంజీవి రాజ్యసభకు కాంగ్రెస్‌ టికెట్‌ పై ఎన్నికయ్యాక డా.మన్మోహన్‌ సింగ్‌ యూపీఏ కేబినెట్లో పర్యాటక శాఖా మంత్రిగా కూడా పనిచేశారు.


జనసేన కాపుల పార్టీ 2.0..
ప్రాంతీయ రాజకీయ పక్షాన్ని నడపడం కాపు హీరోల వల్ల కాదనే అపప్రధను పోగొట్టడానికి ఆయన చిన తమ్ముడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ 2014 సాధారణ ఎన్నికల ముందు జనసేన పార్టీ పేరుతో కాపులు సహా తెలుగువారందరి కోసం ప్రాంతీయ పార్టీ పెట్టారు. లోక్‌ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో ఆయన జనసేన పార్టీ నిర్మాణం జోలికి పోలేదు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేతతో కలిసి అవశేషాంధ్రలో అనేక ఎన్నికల బహిరంగసభల్లో ప్రసంగించారు కల్యాణ్‌ బాబు. అంతేగాని అసలు రూపం, సారం లేని తన పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దింపకుండా తెలివైన చేశారు. జనసేన మద్దతుతో ప్రధాని, సీఎం పదవులు పొందిన మోదీ, చంద్రబాబులతో ఏం జరిగిందో ఏమోగాని 2019 జోడు ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి ఎన్నికల్లో దిగితే జనసేనాని పార్టీకి వచ్చింది ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం. అది కూడా తీవ్ర కాపు చైతన్యం, కాపు స్పృహ, కాపోన్మాదం ఉన్న తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోనే సాధ్యమైంది. దీంతో గత ఐదేళ్లుగా ఆయన పార్టీలో తనకు కోపైలట్‌ గా ఉన్న నాదెండ్ల మనోహర్‌ (ఎన్టీఆర్‌ కు స్వయం ప్రకటిత కోపైలట్, మొదటి విఫల వెన్నుపోటుదారుగా అపకీర్తి మూటగట్టుకున్న నాదెండ్ల భాస్కరరావు గారబ్బాయి) సాయంతో జనసేనను కిందామీదా పడి నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు, ఒక శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేని బీజేపీతో మొదట పొత్తు పెట్టుకున్నా చివరికి తెలుగుదేశం అధినేతతోనే సీట్ల సర్దుబాటు ప్రకటించడంతో పవన్‌ కల్యాణ్‌ రాజకీయ వివేకం అర్ధమౌతోంది. పెద్దన్నయ్య చిరంజీవితో పోల్చితే ఆయన చిన్న తమ్ముడే ఆంధ్రా పాలిటిక్స్‌ లో కాపుల పేరు సజీవంగా ఉండేలా చేయడంలో కొంత వరకు సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కిందటి ఎన్నికల్లో జనసేన కేవలం 5.53 శాతం ఓట్లను మాత్రమే పొందినాగాని 24 అసెంబ్లీ సీట్లలో, మూడు పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీచేయడానికి తెలుగుదేశం అధినేతను పవన్‌ బాబు ఒప్పించడం నిజంగానే కాపుల రాజకీయ చరిత్రలో చాలా గొప్ప గెలుపు.

కాపుల పరువు తీసింది కొణిదెల కుటుంబం కాదు, గోదావరి కాపు నేతలే!

అలాంటిది చేగొండి హరిరామ జోగయ్య వంటి కాపు కురువృద్ధులు, పలువురు కాకలు తీరిపోయిన తెలుగు కాపు పాత్రికేయులు కొణిదెల పవన్‌ కల్యాణ్‌ పై విరుచుకుపడడం హేతుబద్ధంగా లేదు. పాతిక లోపు అసెంబ్లీ సీట్లకు ఒప్పుకోవడం అంటే కాపుల పరువు తీయడంగా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి మేధావులు భావిస్తున్నారంటే వారు రాజకీయంగా ఏ లోకంలో జీవిస్తున్నారో ఇప్పుడు చెప్పడం కష్టం. కాపుల సంఖ్యాబలం తెలుగు సినిమా రంగంలో ఉన్నంతగా (నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు) ఏపీ ఓటర్లలో లేదనే విషయం కల్యాణ్‌ బాబుకు తెలుసు. అందుకే 24 సీట్లతో ముందుకుపోతున్నారు. ఈ విధంగా తెలుగునాట ఎన్నికల రాజకీయాల్లో కాపు సముదాయానికి ఒకరకంగా ఎంతో మేలు జరిగిందని చెప్పవచ్చు. 2024 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల తర్వాత కాపులకు రాజ్యాధికారం రాకున్నా రెడ్డి ముఖ్యమంత్రి అయినా, కమ్మ మాజీ సీఎం అయినా కాపుల జనామోదంతోనే మరోసారి గద్దెనెక్కుతారనే జనాభిప్రాయం పవన్‌ కల్యాణ్‌ వ్యూహాలు, ఎత్తుగడల ఫలితంగానే ప్రచారంలోకి వచ్చింది. ఒక ఎలక్షన్‌ తోనే జెండా పీకేసిన మెగాస్టారన్నయ్య కంటే పవర్‌ స్టారే కాపు సమాజానికి ఎక్కువ ప్రయోజకారి అని నిరూపించుకున్నాడు. ఏపీ 16వ శాసనసభ ఎన్నికల్లో ‘కే’ ఫ్యాక్టర్‌ అంటే కమ్మ ఫ్యాక్టర్‌ కాదనీ– కాపు ఫ్యాక్టర్‌ అని తేల్చి చెప్పినందుకైనా కల్యాణ్‌ బాబును సకలాంధ్ర కాపు కులాల సముదాయం మెచ్చుకుంటే మంచిది. ‘కే’ ఫ్యాక్టర్‌ వల్ల ఇప్పుడు జనసేనతోపాటు రెడ్డి, కమ్మల ఆధిపత్యం కాస్త ఎక్కువగానే కనపడే రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఈసారి అసెంబ్లీ టికెట్లను కాపులకు వారి జనాభా నిష్పత్తికి మించి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇదంతా జనసేనాని వల్లే సాధ్యమైందనుకోవాలి. ఒకపక్క తెల్లగడ్డం, తెల్ల మీసాలతో గుంటూరు కాపు నేత అంబటి రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లాలో మూలాలున్న మరో ఒరిజినల్‌ నటుడు కాపు నటుడు బలిరెడ్డి పృథ్విరాజ్‌ విన్యాసాలు, మరో పక్క నాటకానుభవం లేని గుడివాడ అమర్నాథ్, పేర్ని వెంకట్రామయ్య వంటి బడా బడా కాపు నేతల రంకెలు చూస్తుంటే ఈసారి తెలుగునాట జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మున్నెన్నడూ లేని విధంగా ‘కే’ ఫ్యాక్టర్‌ చర్చనీయాంశంగా మారుతోంది.