Nancharaiah merugumala senior journalist:(స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని ‘చైర్మన్’ మావో జెడాంగ్ వర్ణిస్తే.. చట్ట సభల్లో చట్టసభల్లో ‘మూడో వంతు’ అంటున్న ప్రధాని మోదీ)
చైనా విప్లవ నాయకుడు, పాలకుడు ‘చైర్మన్’ మావో జెడాంగ్ ఓ మార్క్సిస్టుగా– స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని వర్ణించాడు. అంతటితో ఆగకుండా తన చివరి రోజుల్లో ఆయన తన నాలుగో, ఆఖరి భార్య జియాంగ్ కింగ్ కు అధికారంలో అర్ధభాగం కన్నా ఎక్కువే వాటా ఇచ్చారు. మావోకు 40 సంవత్సరాలు నిండక ముందే ఆయన భార్యలు మొదటి ఇద్దరూ (లువో జియూవూ, యాంగ్ కైహూయీ) మరణించడంతో మూడో మహిళను (హే జీజెన్) పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెకు విడాకులిచ్చారు. తన కన్నా వయసులో 21 ఏళ్లు చిన్నదైన చివరి భార్య జియాంగ్ కింగ్ కు మాత్రం తన చివరి కాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీలో, ప్రభుత్వంలో మితిమీరిన పెత్తనం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. సరే, ఆకాశంలో స్త్రీని సగం అని చెప్పిన ఈ చైనా బడా కామ్రేడ్ తన చిన్న భార్యకు మంచి పెత్తనం ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు. ఇక మన ప్రధాని నరేంద్ర మోదీ విషయానికి వస్తే, ఇప్పుడు పాత మహిళా రిజర్వేషన్ బిల్లుల్లోనే నిర్ణయించిన మూడో వంతు కోటాను చట్టసభల్లో కల్పించడానికి తాజా 128వ రాజ్యాంగ సవరణ బిల్లు–2023లో ప్రతిపాదించారు. నరేంద్ర భాయ్ భార్య విషయానికి వస్తే–తన భార్య జశోదా బెన్ ను తన 18 ఏటనే పెళ్లాడారు. కాని ఆమెతో కాపరం చేయలేదట. విడాకులూ తీసుకోలేదు. వ్యక్తిగత జీవితంలో తన తల్లి హీరా బెన్ కు ఇచ్చిన ప్రాధాన్యం ఆయన మరే మహిళకూ ఇవ్వలేదు. అయితే, మోదీ కేంద్ర కేబినెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, మహిళా, శిశు సంక్షేమ, మైనారిటీ వ్యవహారాల శాఖల మంత్రి స్మృతీ ఇరానీలు నిండు నోరున్న మహిళలేగాని పార్టీలో, ప్రభుత్వంలో ఎంత పలుకుబడి వారికుందో తెలియదు.