పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా లోపాలు తలెత్తడం తీవ్ర దుమారానికి తెరతీసింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
కాగా మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన అర్ధంతరంగా రద్దు కావడం రాజకీయ దుమారానికి తెరతీసింది. పర్యటనలో భాగంగా బఠిండా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ప్రధాని…..అక్కడి నుంచి ఫిరోజ్‌పూర్ జిల్లా హుస్సెనివాలాలోని స్వాతంత్ర్య సమరయోధుల స్మారక స్థూపం దగ్గర నివాళులర్పించేందుకు హెలికాప్టర్‌లో వెళ్లాలనుకున్నారు. ఐతే వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించారు. రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని పంజాబ్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో రోడ్డు మార్గంలో బయల్దేరిన ప్రధాని.. మరో 30 కిలోమీటర్లయితే గమ్యస్థానం చేరుతామనగా….మధ్యలో ఫ్లై ఓవర్‌పై కొంతమంది నిరసనకారులు రోడ్డును దిగ్భందించారు. దీంతో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రధాని మోడీ ఫిరోజ్‌పూర్ బహిరంగసభను రద్దు చేసుకుని తిరిగివెళ్లిపోయారు. అనంతరం తిరిగి బఠిండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని అక్కడి అధికారులతో మాట్లాడుతూ పంజాబ్ సీఎంపై సెటైర్లు వేశారు. తానూ తిరిగి ప్రాణాలతో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నందుకు సీఎంకు థాంక్స్ చెప్పాలంటూ సెటైర్ వేశారు.
అటు ఈ ఘటనకు పంజాబ్ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు. పంజాబ్‌లో మోడీ పర్యటన రద్దు కావడం దురదృష్టకరమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పంజాబ్‌లో వేల కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనకు అంతరాయం కలిగిందన్నారు. కాంగ్రెస్ తీరు చూసి ప్రజాస్వామ్య విలువలను పాటించే వారేవరికైనా బాధ కలుగుతుందన్నారు నడ్డా. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదన్నారు. కావాలనే పంజాబ్ ప్రభుత్వం మోడీకి హానీ కలిగించే ప్రయత్నం చేసిందన్నారు. ప్రధానిని కాన్వాయ్‌ను కొందరు నిరసనకారులు అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ.అభివృద్ధి పట్ల కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఈ ఘటనను చూస్తే అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ కేవలం పాలిటిక్స్ ప్లే చేస్తుందన్నారు. పాకిస్థాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రంలో ప్రధాని మోడీ భద్రతా లోపం తలెత్తడంపై ఉన్నత స్థాయి విచారణ జరగాలన్నారు హిమాంత బిశ్వ.
మరోవైపు ప్రధాని మోడీ పర్యటనపై స్పందించారు మాజీ సీఎం అమరీందర్ సింగ్. పంజాబ్‌లో శాంతి,భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ కూడా విఫలమయ్యారన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తికి భద్రత కల్పించలేనప్పుడు సీఎం, హోం మంత్రి పదవులలో ఉండడం వృథా అని మండిపడ్డారు అమరీందర్ సింగ్.