దేశంలో దడ పుట్టిస్తున్న కొత్త వేరియంట్!

దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యి 892కు చేరుకుంది. ఇందులో మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 578, ఢిల్లీలో 382 ఒమిక్రాన్‌ కేసులతో టాప్‌ టూలో ఉన్నాయి. కేరళలో 185, రాజస్థాన్ 174, గుజరాత్ లో 152 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 1,892 ఒమిక్రాన్ కేసులు నమోదు అయితే.. అందులో 799 మంది కోలుకున్నారు. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.
అటు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 37 వేల 379 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత రోజుతో పోల్చుకుంటే 22 శాతం కేసులు పెరిగాయి. 123 మంది కరోనాతో మరణించారు. మహారాష్ట్రలో కొత్త 18వేల 466 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, అందులో ముంబైలోనే 10వేల 860 ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో 5481 కొత్త కోవిడ్‌ కేసులు వెలుగుచూశాయి.
ఇక ఆందోళన కలిగించే స్థాయిలో కరోనా కేసుల పెరుగుదల ఉంటుండడంతో రాష్ట్రాలు మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఢిల్లీ బాటలోనే కర్ణాటక కూడా వీకెండ్‌ కర్ఫ్యూ ప్రకటించింది. బీహార్‌ లో ప్రీ స్కూల్‌ ఒకటి నుంచి 8వ తరగతి వరకు క్లాసులు బంద్‌ చేసింది. 9 నుంచి 12వ తరగతి వరకు క్లాసులు 50శాతం కెపాసిటీతో నడిపించాలని ఆదేశించింది. అలాగే నైట్‌ కర్ఫ్యూను కూడా విధించింది. ఇక ముంబై, పూణేలో విద్యాసంస్థలను మూసివేశారు. పంజాబ్‌, ఛత్తీస్‌ గఢ్ రాష్ట్రాలు కూడా కఠిన ఆంక్షలు విధించాయి. బహిరంగ సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించాయి.

మరోవైపు వ్యాక్సినేషన్ స్పీడప్ చేసింది కేంద్రం. సోమవారం నుంచి ప్రారంభమైన టీనేజర్ల వ్యాక్సినేషన్ కు చక్కని ఆదరణ లభిస్తోంది. 15 నుంచి 18 ఏళ్ల వారికి టీకా వేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 40లక్షల మందికి పైగా టీనేజర్లకు వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.