telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కెసిఆర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నాగర్ కర్నూల్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలు పార్టీ ఫిరాయించడంతో ఆపార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. తాజాగా చేవెళ్ల సిట్టింగ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. దీంతో అప్రమత్తమైన గులాబీ బాస్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రంగంలోకి దించే యోచనలో కేసిఆర్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఇటీవలే వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చేవెళ్లలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ సుంచి ఆమె ఎంపీగా పోటిచేస్తారన్న టాక్ నడుస్తోంది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు ఖరారైంది. దీంతో చేవెళ్ల నియోజకవర్గంలో మంచి పట్టున్న సబితా ఇంద్రారెడ్డిని అక్కడి నుంచి పోటిచేస్తే బీఆర్ఎస్ కి కలిసొస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నట్లు ఆపార్టీలో చర్చ జరుగుతుంది.
ఇటీవల చేవెళ్ల జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచే దమ్ముందా? అంటూ బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. ఆయన ఈవ్యాఖ్యలు చేయడం వెనక రాజకీయ లెక్కలు వేరుగా ఉన్నట్లు బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.ఈనేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీ రంజిత్ ప్లేస్ లో మాజీ మంత్రిని పోటిచేయించాలని వాదన తెరపైకి వచ్చింది.కేసీఆర్ సైతం సిట్టింగ్ ఎంపీ సీటు మార్పుకు సుముఖంగా ఉన్నారన్న వాదన బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తుంది.
మొత్తంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో త్రిమూఖ పోటి ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపి సీటు కాపాడుకోవాలని బీఆర్ఎస్..ఎలాగైనా సరే సీటు దక్కించుకోవాలని బీజేపీ,కాంగ్రెస్ పట్టుదలగా కనిపిస్తున్నాయి.