దేశంలో కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ అవసరం లేదని భారతీయ రిజర్వు బ్యాంక్ చీఫ్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. గురువారం టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగాలన్నారు. రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమే అయినప్పటికీ ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుండటాన్ని గుర్తు చేశారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ జరిగిందని, ఇది ఆటంకాలు లేకుండా కొనసాగాలని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 10.5 శాతంలో తగ్గుదల ఉంటుందని తాను భావించడం లేదని చెప్పారు.
ఇక విదేశీ మారక ద్రవ్య నిల్వలు, కరెన్సీ మార్కెట్‌లో ఆర్బీఐ జోక్యం గురించి ఆయన మాట్లాడుతూ.. కరెన్సీ నిలకడ కోసం మాత్రమే ఆర్బీఐ ప్రయత్నిస్తోందన్నారు. మన దేశం గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో 53,476 కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు.