ఏడో తరగతి దాటితే… ఇక చదువు లేదు అప్పుడు మా ఊళ్లో! 3 కిలోమీటర్ల పొరుగునున్న రంగంపేట వెళితేనే హైస్కూల్ ! రెండు చెరువు కట్టల మీదుగా… పొలాలు, గట్లు, బీడు/పంట చేలు దాటుకుంటూ అలా ఏడాది పాటు, 8వ తరగతి, రోజూ వెళ్లి-వస్తూనే చదివేశా! ఇక, 1976-77 తొమ్మిదో తరగతి సగమయ్యాక అనుకుంటా… మా అన్న గట్టిగా సిఫారసు చేస్తే, బాపు సైకిల్ ఇప్పిచ్చాడు. మా డీజిల్ పంపుసెట్ మెకానిక్ కైర్(సాబ్), సికింద్రాబాద్ వెళ్లి, కొత్త ‘హెర్క్యులస్’ సైకిల్ ఫిట్ చేయించుకొని తెచ్చాడు. అప్పటికే… అద్దె సైకిల్ తెచ్చుకొని… కాంచిడ్ (అందదు కనుక సీటుపై కూర్చోకుండా, అది చంకలోకి వచ్చేలా కుడి చేయిని చుట్టి, ఎడమ చేత్తో హ్యాండిల్ ఒకవైపున్నే పట్టుకొని, రెండు పాదాలతో పైడ్లింగ్ చేస్తూ సైకిల్ నడిపే సాహసిక క్రీడ) తో మొదలెట్టి, సీట్ పైకి వచ్చి, అలా…. రకరకాలుగా వెంటబడి, దిగాలు పడి, పలుమార్లు కిందపడి, ఎన్నెన్నో తంటాలు పడి… మొత్తమ్మీద, సైకిల్ నడపడమనే విద్య నేర్చుకొని ఉంటిని. కొత్త సైకిల్ తో చాన్నాళ్ళ మోజు తీరింది. 10వ తరగతి వచ్చేసరికి… వెనుక ఒకర్ని కూర్చోబెట్టుకొని కూడా కట్స్ కొట్టే నైపుణ్యం అబ్బింది.
===========
సరిగ్గా 32 ఏళ్ల కింద, డిసెంబర్ 1990 హిందు-ముస్లీం మతకలహాలతో హైదరాబాద్ అట్టుడికింది. పార్థివాడ, షక్కర్ గంజ్ లో ఆ కాలరాత్రి విద్యుత్ సరఫరా నిలిపేసి, ముష్కర మూక మారణాయుధాల దాడులతో జరిపిన ఊచకోతలో సచ్చిన 56 మందితో పాటు మొత్తం 250-300 మంది వరకు ప్రాణాలు గాల్లో కలిసిన నెత్తుటి చరిత. గవర్నర్ బంగలా రాజ్ భవన్ ముందరి మదార్ సాబ్ మక్తతో కలుపుకొని ఖైరతాబాద్ వంటి ప్రాంతాలూ అరుదుగా రెండ్రోజుల పాటు ‘కర్ఫ్యూ పడగ’ కిందకు వచ్చాయి. నేనప్పుడు ఈనాడు, సిటీ క్రైమ్ రిపోర్టర్ ని. అప్పటికింకా నా ‘టూ వీలర్’ (ఎల్లెమ్మెల్) రాలేదు, బస్సుల్లోనే తిరిగేది. కర్ఫ్యూ వల్ల బస్సుల్లేవు. దోమల్ గూడ, గగన్ మహల్ ఎదుటి గల్లీ నుంచి, సోమాజిగూడ ‘ఈనాడు’ ఆఫీస్ వరకు, రాత్రి తిరిగి వెనక్కి ఇంటి వరకు, ఆ రెండు రోజులు… మా మేనమామ కూతురైన మరదలు మాధురి సైకిలే నాకు తోడైంది. ‘అయ్యో, మరెలా ఇపుడు! నా సైకిల్ తీస్కెళతారా బావ?’ అని అడిగి మరీ, సహాయానికి ముందుకొచ్చింది మా మరదలు. ఇప్పుడు తానో ప్రాక్టీసింగ్ లాయర్! మామ వాళ్ళ ఇంటి ఎదురు పోర్షన్ లో, అద్దె ఇంట్లో ఉంటున్న ‘బ్యాచ్లర్’ని నేనప్పుడు !
============
కోవిడ్ ‘తొలి అల’ జనాల్ని జడిపిస్తున్న రోజులవి. వైరస్ కన్నా వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారమే మనుషుల్ని భయపెడుతున్న పాడుకాలం! సెలవులిచ్చి మా ‘సాక్షి’ జర్నలిజం స్కూల్ పిల్లల్ని ఇళ్లకు పంపించివేశాం. మూడు, నాలుగు రోజుల గ్యాప్ తర్వాత ఓ పూట కనిపించాడు శానిటేషన్ పనులు చేసే నర్సింహ. “ఏమీ! నిన్నా, మొన్నా కనబడలేదు?” క్యాజువల్ గానే అడిగా! “జెరంతో పండిన, చాతగాలేదు, అందుకె రాలేదు సార్, ఇయాళ జెర నయముండె, వచ్చిన’ అన్నడు. నర్సింహా సాక్షి హౌజ్ కీపింగ్ టీమ్ లో పనిచేసే ఔట్ సోర్సింగ్ దినకూలీ! “అయ్యో! మరి, చూయించుకున్నవా ? ఏమన్నడు డాక్టర్! కోవిడ్ పరీక్ష చేసుకోమనలే?” కాస్త కన్సెర్న్ తోనే అడిగా! “అదేం లేద్సార్! నాకు దగ్గు-గిగ్గు ఏమీలేవు. నాల్రోజులు… జెరంత నడ్సుడు ఎక్కువై అల్సిపొయ్న. శాతగాకనే జెరమొచ్చింది, గంతే! ఇయాళ తగ్గింది, జెర నయముంది వచ్చిన’ బదులిచ్చాడు. కాసింత లోతుగా ఆరా తీస్తే తెలిసిందేమంటే… బస్సులు తిరగట్లే, ఆటోలూ దొరక్క, ఒకటీ-అర దొరికినా చార్జీలు చుక్కలంటి, నాలుగయిదు రోజులుగా ఇంటి నుంచి స్కూల్ కి, తిరిగి ఇంటికి నిత్యం కాలినడకన వచ్చి, వెళుతున్నాడు. అదీ, తిరుమలగిరి నుంచి పంజాగుట్ట వరకు, ఓ పదిహేను కి.మీ ఉంటుందేమో! నోరు వెళ్లబెట్టడం నా వంతయింది. “అంతంత దూరం రోజూ రెండుసార్లు ఎలా నడుస్తున్నావయ్యా? ఆ… ” రవంత నిష్ఠూరం, ఒకింత ఆశ్చర్యంతో అడిగితే “మరేం చేయను సార్! ఇంకో దారి లేదాయె. ఒకాయన మా గల్లీలో సైకిల్ అమ్ముతానంటే తీసుకుందాం అనుకున్న, హాయిగా అదేసుకొని తిరగొచ్చని. కానీ, బేరం కుదరనిస్తలేడు, ఆరు వందలంటున్నడు…” ఆ మాట అంటుండగానే, జేబు లోంచి 600 తీసి, ‘ఇదుగో నర్సింహా, ఇవి అతనికిచ్చెయ్, నువ్ మాత్రం రేపు నాకు ఆ సైకిల్ తోనే కనిపించాలె’ అంటూ ఆ డబ్బు చేతిలో పెట్టా! మారు మాటాడలేదు. తర్వాతి రోజు సైకిల్ తోనే కనిపించాడు. ఆతని కళ్లల్లో నిన్నటి కన్నా ఇవాళ ఎక్కువ వెలుగుంది. హమ్మయ్య! ఏమైతేనేం, మంచిదైంది. ఒకరోజు, ఒకపూట…. అలా దారంట వెళ్లే ఓ ఫ్రెండ్ ని రమ్మని నే పిలిచినా, లేదు తనంత తా వచ్చినా, భోజనపు వేళయింది కదా! అని లంచ్ కోసం బయట్నుంచి బిర్యానీ పార్సల్ తెప్పించినా అంతకన్నా ఎక్కువే ఔతుంది ఒకోసారి.
ఏదైనా… అలా కుదరాలంతే!!
……….. ♂️
=============
దిలీప్ రెడ్డి
పీపుల్స్ పల్స్ డైరెక్టర్