త్వరలో చిన్న పిల్లలకు కోవిడ్ టీకా: అపోలో ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి

కరోనా టీకా విషయంలో అపోల్ గ్రూప్ చైర్మన్ కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే చిన్నారులకు కూడా టీకాలు వేయనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, తొలి ప్రాధాన్యం మాత్రం కోమార్బిడిటీస్ తో బాధపడుతున్న వారికేనని తెలిపారు. వీరికి ఉచితంగా టీకాలు వేస్తామని పేర్కొన్న ఆయన.. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కొవాగ్జిన్ టీకా ఇప్పటికే సిద్ధమైందని, ఈ టీకాను రెండు డోసుల్లో 28 రోజుల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలాగే, 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి జైకోవ్-డి టీకా సిద్ధమైందని, దీనిని 28 రోజుల వ్యవధిలో మూడు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుందని ప్రతాప్‌ సి.రెడ్డి తెలిపారు. ఇది సూది రహిత వ్యాక్సిన్ అని పేర్కొన్నారు. త్వరలోనే టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.