నిరుద్యోగుల అండ కోసమే యాత్ర : బండి సంజయ్

ప్రత్యేక వ్యాసం: (బండి సంజయ్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు)

ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తున్నది ఓట్ల కోసమో, అధికారం కోసమో కాదు. తెలంగాణలోని సకలజనులకు విద్యా, ఉద్యోగ, ప్రత్యేక తెలంగాణ సాధన అభివృద్ధి ఫలాలు అందించేందుకు వారికి అండగా నిలబడడం కోసం, విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులకు అండగా నిలబడి  ఖాళీగా ఉన్న కొలవులు భర్తీ చేసే వరకు పోరాటం చేయడం కోసమే ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర.

2014, 2018, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి ప్రజలను చైతన్యవంతం చేయడం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, దళితులు, గిరిజనులకు 3 ఎకరలా భూమి, ఉద్యోగ ఖాళీల భర్తీ, రైతు రుణమాఫీ, కేజీ టు పీజీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం, బీసీ బంధు, గిరిజన బంధును ప్రారంభించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం, మహిళల సంక్షేమం కోసం ప్రత్యేకంగా మహిళా బంధు పథకాలన్ని ప్రవేశపెట్టేందుకు ఒత్తిడి తేవడం కోసం,  బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ ప్లాన్‌ నిధులను ప్రభుత్వం దారిమళ్లకుండా కనిపెట్టుకొని ఉండటం కోసం, పోడు భూములను గిరిజనులు, ఆదివాసులకు దక్కే విధంగా వారికి అండగా నిలబడడం కోసం,  రైతులకు గిట్టుబాటు ధర అందే విధంగా, దళారీల దోపిడీ నుండి వారికి రక్షణ కల్పించడం కోసం, కౌలురైతులకు అండగా నిలబడే దానికోసం,  టీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తానన్న లక్ష రూపాయల రైతు రుణమాఫీ హామీని అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసంమే ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర. 

తెలంగాణ వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, భూమి, ఖనిజాలు, అడవులు ఈ ప్రాంత ప్రజలకే దక్కేందుకు కృషిచేయడం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోని ఉద్యమించిన ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడడంతోపాటు, తెలంగాణ ప్రజల సంస్కృతి, చరిత్రకు, భాషకు, సాహిత్యానికి సముచిత గౌరవం దక్కేవిధంగా కృషిచేయడం కోసమే ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర. 

తెలంగాణ సాధన కోసం ఒక పోరాటం, తెలంగాణ అభివృద్ధి కోసం మరో పోరాటం చేయాల్సి వుంటుందని ప్రొ.జయశంకర్‌ ఉద్యమ సమయంలోనే అనేకసార్లు ఉద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధికోసం కేసీఆర్‌ కుటుంబపాలన, నియంతృత్వ పాలననుండి, మతతత్వ మజ్లీస్‌ పార్టీ నుండి ప్రజలకు విముక్తి కల్గించడం, కేసీఆర్‌ కుటుంబం పాల్పడుతున్న అవినీతి, అక్రమాలను ప్రజలదృష్టికి తీసుకొచ్చి వారిని దోషులుగా ప్రజాకోర్టులో నిలబెట్టడం కోసం. ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇతర పార్టీ నేతలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని ఎండగట్టడం కోసమే ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర. ఈ లక్ష్యాలు నెరవేరే వరక ఎంతకాలమైనా బిజెపి ప్రజాసంగ్రామ పాదయాత్రను నిర్వహిస్తూనే ఉంటుంది.