(బండి సంజయ్ కుమార్, పార్లమెంటు సభ్యులు, కరీంనగర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు)
_______________________
నడక మాత్రమే నాది … నడిపించింది తెలంగాణలోని సకల జనులు..
బంగారు పంటలు కావాలా? … మతం మంటలు కావాలా? తాను బతికుండగా తెలంగాణను ఆగం కానియనని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బిజెపి పార్టీ మాత్రం అభివృద్ధి గురించి చర్చింస్తుంటే, దాన్ని నుండి దృష్టని మళ్లించడం కోసం నానాయాగి చేస్తున్నారు. అందులో భాగమే మతతత్వ పార్టీ ఎంఐఎంతో, ఎర్రగులాబీలతో, కాంగ్రెస్‌పార్టీతో చేతులు కలిపి, రాష్ట్రంలోని మతద్వేషాలు రెచ్చగొట్టి ఆ నెపం బిజెపిపై నెట్టాలని కుట్రలు, కుతంత్రాలకు కేసీఆర్ పాల్పడుతున్నారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఈ విషయాలన్ని అర్థం చేసుకోగలరు.
8 సంవత్సరాల టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ నిజంగా ఆగం అయిపోయింది. కల్వకుంట్ల కుటుంబ కబంధ హస్తాల్లో బంధీ అయిపోయింది. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది కొలువులు, నిలువనీడకు ఇళ్ల్లు, సాగుచేసుకునేందుకు భూమి, తాము పండిరచిన పంటకు గిట్టుబాటు ధర, అన్ని సామాజికవర్గాలకు అవకాశం, కేసీఆర్ కుటుంబ, నియంతృత్వపాలన నుండి విముక్తి. ఫామ్‌హౌజ్, ప్రగతిభవన్ కేసీఆర్ నిర్మించుకున్న గడీలను విడిచి తెలంగాణలో ప్రజలను కలిస్తే ఈ విషయం సుస్పష్టమౌతుంది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఏనాడూ ప్రజలకష్టాలు, కడగండ్లు తెలుసుకోవడానికి గడపదాటని ముఖ్యమంత్రి తన అధికారపీఠాలు కదులుతుండటంతో, వారి కుటుంబం అవినీతి, అక్రమాలు బయటపడుతుండటంతో బెంబెలెత్తిపోయి తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని మరొకసారి లబ్ధిపొందాలని చూస్తూ బిజెపి పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.
కుటుంబ, నియంతృత్వపాలనను ఎండగట్టానికి, ప్రజాకోర్టులో కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ పార్టీని దోషిగా నిలబెట్టడానికి, ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికే బిజెపి పార్టీ ప్రజాసంగ్రామ పాదయాత్ర చేపట్టింది. పాదయాత్ర మూడో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర నేటితో చారిత్రక ప్రదేశమైన వరంగల్ జిల్లాలోని భద్రకాళి అమ్మవారి దేవాలయం వద్ద ముగుస్తోంది. మూడు విడతలుగా ఇప్పటివరకు జరిగిన ప్రజాసంగ్రామ పాదయాత్రలో 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 1250 కిలోమీటర్లు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించాం. 3 విడతల పాదయాత్రలో ‘‘నడక మాత్రమే నాది … నడిపించింది తెలంగాణలోని సకల జనులు’’ … పాదయాత్ర సందర్భంగా తెలంగాణలోని సకలజనులు, సబ్బండవర్గాలు చూపిన ఆదరాభిమానాలను జీవితంలో మర్చిపోలేను. ప్రజాసంగ్రామ పాదయాత్రకు నైతిక మద్దతును, ప్రోత్సాహాన్ని ఇచ్చి వెన్నుతట్టి ముందుకు నడిపించిన బిజెపిలోని కేంద్రనాయకత్వాన్ని, బిజెపి తెలంగాణ శాఖలోని ప్రతీ ఒక్క నాయకున్ని, కార్యకర్తకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీగారికి, బిజెపి జాతీయఅధ్యక్షులు శ్రీ జె.పి.నడ్డా గారికి, కేంద్ర హోంశాఖామంత్రి శ్రీ అమిత్‌షా గారికి నా వందనాలు.
‘‘జనం గోస విని .. భరోసా కల్పించడం ’’
ప్రజాసంగ్రామ పాదయాత్ర లక్ష్యం వ్యక్తిగత ప్రాబల్యం కోసం ఏమాత్రం కాదు. విద్యార్థులు లైబ్రరీకి వెళ్ళి ఏవిధంగా జ్ఞానం పొందుతారో, అదే విధంగా పాదయాత్ర ద్వారా ‘‘జనం గోస విని ` వారికి బిజెపి భరోసా’’ ఇచ్చే కార్యక్రమం. టీఆర్‌ఎస్ నియంతృత్వ ఎనిమిది సంవత్సరాల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అధ్యయనం చేయడం కోసం, ప్రజలకందాల్సిన సంక్షేమ పథకాలు వారికి అందే విధంగా ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకు వచ్చి సకలజనులకు మంచి జరగాలనే సదుద్దేశ్యంతో నిర్వహిస్తున్నదే ఈ పాదయాత్ర కార్యక్రమం. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేద ప్రజల కోసం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు, అవి సక్రమంగా అమలవుతున్నాయో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించడానికే ఈ పాదయాత్ర. మొదటి విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సందర్భంగా బిజెపి తెలంగాణ శాఖ రెండు ప్రధానమైన హామీలను ఇచ్చింది. అవి ఉచిత విద్య, వైద్యం. ఈ రెండు హామీలకు బిజెపి కట్టుబడి ఉంది. వాటిని కచ్చితంగా అమలు చేసితీరుతాం.
ప్రజాసంగ్రామ పాదయాత్ర మరో లక్ష్యం బిజెపి పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని, మౌలిక లక్ష్యాలైన జాతీయవాదం, జాతి సమైక్యత, ప్రజాస్వామ్యం, సమాతా`యుక్త్, శాసన్ ముక్త్, సర్వమత సమభావం, విలువలతో కూడిన రాజకీయాలను ప్రచారం చేయడం. ఈ అంశాలను జయప్రదంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం.
ప్రజాసంగ్రామ పాదయాత్రకు రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ సర్కార్ అనేక ఆటంకాలు సృష్టించింది. రౌడీ మూకలతో, కిరాయి జనంతో శాంతియుతంగా గాంధేయ మార్గంలో నిర్వహిస్తున్న పాదయాత్రీకులపై దాడుల చేయించింది. పాదయాత్ర చేస్తున్న అనేక మంది నా సహచర నాయకులు, కార్యకర్తలపై టీఆర్‌ఎస్ పార్టీ వారు రాళ్లతో దాడిచేసి గాయపర్చినా, తలలు పగలగొట్టినా, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించినా తెలంగాణలోని సకలజనులు, సబ్బండవర్గాలకు సంక్షేమఫలాలు అందాలనే పవిత్రలక్ష్యంతో పాదయాత్రను కొనసాగించాం. అధికార టీఆర్‌ఎస్ పార్టీ దాడులు ఎన్ని చేసినా, కవ్వించినా, గిల్లికజ్జాలు పెట్టుకున్నా సంయమనముతో యాత్రను శాంతియుతంగా నిర్వహించాం. దేశచరిత్రలో ఎన్నడు లేని విధంగా పాదయాత్ర చేస్తున్న నన్ను అరెస్టు చేయడమే కాకుండా పాదయాత్రను నిలిపివేయాలని పోలీసులు చేత నోటీసులు ఇప్పించిన ఘనత టీఆర్‌ఎస్ సర్కార్‌కే దక్కుతుంది. ధర్మం మా పక్షాన ఉండటంతో న్యాయస్థానానికి వెళ్ళి పాదయాత్రకు అనుమతి తెచ్చుకొని పాదయాత్రను కొనసాగిస్తున్నాం.
తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడంలో బిజెపి పాత్రను ఎవరూ కాదనలేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో బిజెపి పాత్ర ఎంతో కీలకమైనది. గోదావరి జలాలను సమర్థవంతంగా, సంపూర్ణంగా వినియోగించుకోవడం కోసం పాదయాత్ర నిర్వహించిన మొట్టమొదటి పార్టీ బిజెపి. తెలంగాణ వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, భూమి, ఖనిజాలు, అడవులు ఈ ప్రాంత ప్రజలకే దక్కేందుకు కృషి చేయడం కోసం బిజెపి మొదట్నుంచి కృషిచేస్తోంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఫలాలను కేసీఆర్ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల నుండి విముక్తి చేసి, ఆ ఫలాలను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అందే విధంగా కృషి చేయడమే ఈ పాదయాత్ర ప్రధాన లక్ష్యం. బిజెపి ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రారంభించిన తరువాతే అధికార టీఆర్‌ఎస్ పార్టీ అరకొర
ఉద్యోగనోటిఫికేషన్లను విడుదల చేసింది, దళితబంధు ప్రకటించింది, కొత్త పెన్షన్లను మంజూరు చేస్తోంది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల సహాయసహకారాలతో ప్రజాసంగ్రామ పాదయాత్ర సాధించిన విజయాలు.
కల్వకుంట్ల ప్రభుత్వంపై వస్తున్న అవినీతి మరకలను చెరిపివేసేకునేందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు చివరికి పాదయాత్ర కార్యక్రమాన్ని పోలీసు బలగాలతో ఆపింది. అయినా న్యాయస్థానంలో దీనిపై పోరాడి ప్రజాసంగ్రామపాదయాత్రను యధావిధిగా కొనసాగించాం. గత ఎనిమిదేండ్ల కాలంలో ప్రజలకిచ్చిన ఏ హామీని సక్రమంగా అమలు చేయని టీఆర్‌ఎస్ సర్కార్ తమను ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు అడుగడుగునా ప్రయత్నిస్తోంది. ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం నియంతలకే చెల్లుబాటు అవుతుంది. నిజాం రజాకార్లతో సావాసం చేస్తున్న కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తారనుకోవడం మన అమాయకత్వమే అవుతుంది.
ఈ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌజ్‌ల మునకపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ రకమైన పరిస్థితి ఎందుకు దాపురించిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్ తెలంగాణ ప్రజల్లో చర్చలో ఉన్న అంశాలను పక్కదారి పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.