Krishna Janmashtami 2022 : మహావిష్ణువు దశావతారాల్లో శ్రీ శ్రీ కృష్ణావతరాం ప్రత్యేకం. చెడును అంతమొందించి, మంచిని పెంచేందుకు శ్రీకృష్ణుడు అవతరించాడని భక్తుల నమ్మకం.స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్తగా భారత సంస్కృతిని, మన జీవితాలను అనేక రకాలుగా ప్రభావితం చేశాడు. భగవద్గీతను బోధించి జీవిత సార్థకతను తెలియజేశాడు. ధర్మ సంరక్షకుడిగా కీలకమైన పాత్రను పోషించాడు. . అల్లరి కృష్ణుడు, కొంటె కృష్ణుడు, వెన్న దొంగ, వెన్న గోపాలుడిగా..పలు రకాల పేర్లతో కన్నయ్యను పిలుస్తూ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటాం.
జన్మాష్టమి ఎప్పడు జరుపుకోవాలి?
శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజునాడు పగలు గానీ రాత్రి కానీ రోహిణీ ఏ మాత్రం ఉన్నా లేదా భాద్రపదంలో ఉన్నా ఆనాడు కృష్ణ జయంతి జరుపుకోవాలని పురాణ వచనం. ఈ పండుగ రోజున ఒకపూట భోజనం చేసి వేణుమాధవుడికి పూజ చేసి.. శ్రీకృష్ణ దేవాలయాలు దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలం వస్తుందని భక్తుల నమ్మకం. కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈరోజున కిట్టయ్య ను పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది. అంతేకాక కృష్ణాష్టమి రోజున గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఎంతో కొంత పఠించాలని పండితులు చెబుతుంటారు.
ధర్మ మర్థంచ కామంచ
మోక్షంచ మునిపుంగవా
దధాతి వాంఛితా నర్ధాన్
యే చాన్యే ప్యతి దుర్లభా
అనగా ధర్మమును , అర్థమును , కామమును , మోక్షమును కోరిన వాటిని వేటినైనా అతి దుర్లభములైనా జన్మాష్టమి , జయంతి వ్రతం ఆచరించిన వారికి పరమాత్మ ప్రసన్నుడవుతాడని పురాణాలు చెబుతున్నాయి.
కృష్ణం ధర్మం సనాతనం
పవిత్రాణాయ సాధూనాం
వినాశయ చతుష్కృతాం
ధర్మ సంస్థాప నార్ధాయ
సంభవామి యుగేయుగే
అని ఉద్ఘోషించిన పరమ దయాళువు శ్రీకృష్ణ పరమాత్ముడు. సజ్జన రక్షణను దుష్టజన శిక్షణకు ధర్మ సంస్థాపనకు ప్రతి యుగంలో అవతరిస్తాడని దానికి అర్థం.
సంతాన గోపాల మంత్రం..
సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన గోపాలుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుందని పండితులు చెబుతారు.ఈ మంత్రాన్ని 108 సార్లు ధ్యానం చేసేవారిని దుఃఖం దరిచేరదని భక్తుల విశ్వాసం.
ఓం నమో నారాయణాయ, నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు!
ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః!
ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః!