సుబ్రహ్మణ్యస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుండి 100 కిలో మీటర్ల దూరంలో, తిరునల్వేలికి తూర్పుగా 62 కిలో మీటర్ల. దూరంలో, తిరుచెందూర్లోని సముద్రపు అంచునే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం.
స్థలపురాణం:
తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించి, బాధిస్తూ ఉండేవాడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ వెళ్లి పరమేశ్వరుని ప్రార్థించగా, తారకాసురుని సంహరించే బాధ్యత కుమారస్వామికి అప్పగించాడు. అప్పుడు కుమారస్వామి గొప్పతపస్సు చేయగా అతని తల్లి పార్వతీదేవి ఆదిశక్తి రూపంలో ప్రత్యక్షమై, తన శక్తినంతా పొదిగిన ఒక బల్లెం (శూలం) కుమారునికి ప్రసాదించింది. తరువాత త్రిమూర్తులు, మిగిలిన దేవతలు అందరూ కూడా తమతమ అంశలకు సంబంధించిన శక్తులన్నీ ఆ బల్లెంలో నింపారట. తరువాత కుమారస్వామి తారకాసురునితో యుద్ధం చేసి, ఆ.తారకాసురుని సంహరించాడు. ఈ వృత్తాంతం జరిగినది ఈ తిరుచందూరులోనే అని అంటారు.
తారకాసురుడ్ని సంహరించిన తరువాత అతని తమ్ముడైన శూరపద్ముడు పారిపోతూ ఒకచోట ఒక మామిడిచెట్టుగా మారిపోయాడట. కుమారస్వామి తన బల్లెంతో ఆ చెట్టును రెండుగా చీల్చి శూరపద్ముని గూడా చంపివేశాడట. అప్పుడు ఆ చెట్టులోని ఒక భాగం నెమలిగాను, మరొకభాగం ఒక కోడిగాను రూపం దాల్చాయట. ఆ రెండింటిని స్వామి తన వాహనాలుగా స్వీకరించాడు. ఆయన ఆయుధమైన బల్లెం సుబ్ర హ్మణ్యేశ్వరుని గుర్తుగా పూజింపడుతూ ఉంటుంది. సంవత్సరంలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంవత్సరం పొడుగునా భక్తులు కావడులు సమర్పిస్తారు. ఇక్కడ స్కందషష్టికి ఆరురోజులు జరిగే బ్రహ్మాండమైన ఉత్సవంలో అనేక మంది భక్తులు వచ్చి దేవాలయ ప్రాంగణంలోనే విశ్రమిస్తారు. రైతులు తమ మొదటి ఫలసాయాన్ని ఇచ్చటి సుబ్రహ్మణ్యస్వామికి సమర్పించడం ఆచారం.
శక్తివంతమైన విగ్రహం
ఈ ఆలయములోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఎంతో శక్తి వంతమైనదిగా చెబుతారు. దీనికి సంబంధించి అనేక సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి. 1646 – 1648 మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు. పోర్చుగీసులతో యుద్ధ సమయంలో వారంతా ఈ ఆలయంలో ఆశ్రయం పొందారు. స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. రోజు రోజుకూ పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకు వెళ్లిపోయారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇదంతా ఆ విగ్రహం వల్లనే అని గ్రహించి వారు దానిని సముద్రంలో వదిలివేస్తారు. దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది. కొద్ది రోజుల తరువాత వాడమలయప్పన్ పిళ్లై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు. సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతాడు. అలాగే సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది. దీంతో దానిని మరలా ఆలయంలో ప్రతిష్ట చేశారు. ఇదంతా ఆలయంలో పెయింటింగ్ ల రూపంలో కనిపిస్తుంది.