తెలంగాణలో కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. ఓవైపు పేపర్ లీకేజ్ లు, లిక్కర్ స్కాంలతో బీజేపీ, అధికార బిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేసుకుంటుంటే.. మరోవైపు హస్తం పార్టీ నేతలు చాప కిందనీరులా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రతో బిజీ షెడ్యూల్ గడుపుతుంటే .. అటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లె అనిరుథ్ రెడ్డి, పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు రైతుల రుణమాఫీపై దరఖాస్తుల ఉద్యమం పేరుతో జోరుమీదున్నారు. మొత్తంగా ఇన్నాళ్లు అంతర్గత కోట్లాటలతో సతమవుతున్న హస్తం పార్టీకి ఈపరిణామాలు కొంత ఊరటనిచ్చే అంశమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 21 వరోజు మంచిర్యాల జిల్లా జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను పరిశీలించిన అనంతరం.. సంస్థ ఉద్యోగుల వేతనాలు, బొగ్గు ఉత్పత్తి వంటి విషయాలను ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాసులను అడిగి భట్టి తెలుసుకున్నారు. ఈనేపథ్యంలోనే తెలంగాణ కల్పతరువు అయిన సింగరేణికి కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖరాశారు. ఈసందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సమస్యలు బయటకు రాకుండా ప్రశ్నపత్రాల లీకేజ్ ల పేరిట బిఆర్ ఎస్ , బీజేపీ తెఫ్ట్ డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాయని భట్టి ఆరోపించారు. విద్యార్థుల జీవితాలత్ చెలగాటమాడుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు.
అటు జడ్చర్లలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుథ్ రెడ్డి చేపట్టిన రైతు దరఖాస్తుల ఉద్యమానికి రైతన్నల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి దరఖాస్తులు అందజేస్తున్నారు. ఈవిషయంపై అనిరుథ్ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ పేరిట బిఆర్ఎస్ ఆడిన డ్రామాలకు కాలం చెల్లిందని .. కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్మేస్థితిలో రైతులు లేరని కుండబద్దలు కొట్టారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను వారితో కలిసి జిల్లా అధికారులతో పాటు టీపీసీసీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలకు అందజేయనున్నట్లు అనిరుథ్ తేల్చిచెప్పారు.
ఇటు పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు సైతం జడ్చర్ల తరహాలో రైతు రుణమాఫీ దరఖాస్తు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి దరఖాస్తులను అందజేయాలని హస్తం పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం.. రైతులను అన్ని విధాలుగా మోసం చేసిందని.. రైతు రాజు కావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని హస్తం పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు.