భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం!

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షంతో చెన్నై నగరం జలమయమైంది. చెన్నై, పుదుచ్చేరి నగరాలతో పాటు తిరువల్లూర్, రాణిపేట్, వెల్లూర్, తిరుపత్తూర్, తిరువనమలై, కల్లకురిచి, సాలెంలో వరద బీభత్సం కొనసాగుతోంది. విల్లుపురం, కుడలోర్, క్రిష్ణగిరి, ధర్మపురి, నమక్కల్, పెరంబలూర్, అరియలూర్ లోనూ జనం అవస్థలు పడుతున్నారు. వరదనీటికి తోడు మురుగునీరు ఇళ్లల్లోకి చేరి జనం నరకం చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని హాస్పిటళ్లు, ఆఫీసులు జలమయమయ్యాయి. రోడ్లపై 2 నుంచి 3 ఫీట్ల నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలోని ESI హాస్పిటల్ లోకి భారీగా వరద నీరు చేరింది. పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. దీంతో వైద్య సేవలకు అంతరాయం కలుగుతోంది. మెరీనా బీచ్ పూర్తిగా జలమయమైంది.

ఇక మద్రాస్ హైకోర్టు దగ్గర వరదల్లో కొట్టుకువచ్చిన ఓవ్యక్తిని కాపాడారు సీఐ రాజేశ్వరి. స్పృహ తప్పి పడిపోయి ఉన్న ఆ వ్యక్తిని భుజాలపై మోసుకెళ్లారు. అతనికి ప్రాథమిక చికిత్స అందించి, హాస్పిటల్ కు తరలించారు. ఆపత్కాలంలో సీఐ స్పందించిన తీరుపై సర్వత్రా అభినందనలు దక్కుతున్నాయి. మరోవైపు తమిళనాడులో NDRF టీం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో 11, పుదుచ్చేరిలో 2 టీంలు రెస్క్యూలో పాల్గొంటునున్నాయి. మరో 5 టీంలను ముందుజాగ్రత్తగా అందుబాటులో ఉంచారు. మరోవైపు చెన్నై సహా పలు ప్రాంతాల్లో రాత్రి వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వాయుగుండం కాసేపట్లో మహబలిపురం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో అక్కడి పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం మూసేసింది. మొత్తం 7 పోర్టుల్లో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షం, భీకరమైన గాలులతో చెన్నై ఎయిర్ పోర్టును సాయంత్రం ఆరుగంటల వరకు మూసేశారు అధికారులు. దక్షిణమధ్యరైల్వే సైతం పలు సర్వీసులను నిలిపేసింది.
మరోవైపు వరద తీవ్రతపై ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు సీఎం స్టాలిన్. ఆహారం, మంచినీళ్లు నిల్వఉంచుకోవాలని సూచించారు. పదేపదే ఇళ్లనుంచి బయటకు వెళ్లే సాహసం చేయొద్దని కోరారు. AIDMK ప్రభుత్వం తీరువల్లే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. చెన్నై నగరంలోని అక్రమ నిర్మాణాలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.

Optimized by Optimole