రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ నేతల కౌంటర్ అటాక్..

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మాటల తూటాలు పేల్చారు. రాజగోపాల్ బీజేపీలో చేరుతున్నారన్న అక్కసుతో రేవంత్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని బీజేపీనేతలు మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై రేవంత్ చేసిన ఆరోపణల వీడియో క్లిప్పింగ్స్ చూపుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. సోనియాను బలిదేవతగా అభివర్ణించిన రేవంత్.. నేడు తెలంగాణ తల్లి అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్ భాష మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు.

 

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పోరాడిన వ్యక్తి కోమటిరెడ్డి అని కొనియాడారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అలాంటి వ్యక్తిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి .. ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరు రేవంత్ అంటూ ఘూటుగా వ్యాఖ్యనించారు.నాలుగు పార్టీలు మారిన వ్యక్తి .. తమలాంటి నేతల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఆకర్షితులై నేతలు బీజేపీలో చేరుతున్నారని ఈటల స్పష్టం చేశారు.

ఇక రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు చంద్రబాబు కోవర్టుగా భావిస్తున్నారని బాంబ్ పేల్చారు బీజేపీ నేత డీకే అరుణ. ఈసందర్భంగా సోనియా రాహుల్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను వీడియో ప్లే చేసి చూపించారు. నాడు సోనియాను బలిదేవతగా అభివర్ణించి.. నేడు తెలంగాణ తల్లి అంటుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ కి లేదని ఆమె తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దొడ్డిదారిన కాంగ్రెస్ లో చేరిన చరిత్ర రేవంత్ రెడ్డిదని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనన్న విషయం రాష్ట్రపతి ఎన్నికలతో రుజువైందని అరుణ గుర్తు చేశారు.

బ్లాక్ మెయిలర్ గా పేరున్న రేవంత్ రెడ్డికి బీజేపీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఊసరవెల్లి కంటే తొందరగా రంగులు మార్చడం రేవంత్ నైజం అంటూ మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన చేసిన ఆరోపణలు మర్చిపోలేదన్నారు.సోనియా గాంధీని బలిదేవత అని విమర్శించి.. నేడు ఆమె దత్తపుత్రుడిగా మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా అని రాజాసింగ్ ప్రశ్నించారు.

మొత్తంమీద తెలంగాణలో ఉప ఎన్నిక వేడి రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటల తూటాలు పేలుస్తుండగా.. నియోజకవర్గ అభ్యర్థిపై టీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మూడు పార్టీలు వ్యూహా , ప్రతివ్యూహాలతో సమరానికి సై అంటున్నాయి.

Optimized by Optimole