తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై స్టార్ క్యాంపయినర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన పేరును సంబోంధిస్తూ అగౌరవపరచారని..కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాందీ షాపులు పెట్టుకునేవాళ్లంటూ రేవంత్ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని తక్షణమే క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అంటూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారీతీసింది.
ఇక రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన వెంకట్ రెడ్డి.. తాను రాజకీయాల్లోకి వచ్చేనాటికి రేవంత్ పుట్టలేదన్నారు. తనను అనవసరంగా రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. కోమటి రెడ్డి బ్రదర్స్ అంటే నీతినిజాయితీకి పెట్టిందని పేరని.. 34 సంవత్సరాలుగా కాంగ్రెస్ లో ఉన్నానని..రేవంత్ చేసిన వ్యాఖ్యలు బాధించాయని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రేవంత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము సొంతంగా కాంట్రాక్టులు చేసి కష్టపడి పైకి వచ్చామని.. ఎవరిని మోసం చేయలేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
ఇక రాజగోపాల్ పార్టీ మార్పుపై స్పందించిన వెంకట్ రెడ్డి.. పార్టీ మారడం అతని వ్యక్తిగత నిర్ణయమని తేల్చిచెప్పారు. రక్త సంబంధం వేరు రాజకీయాలు వేరన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి రాజగోపాల్ పార్టీ మారుతున్నారని.. రేవంత్ లాగా రాజీనామా కపటనాటకమాడి కాంగ్రెస్ లో చేరలేదన్నారు కోమటిరెడ్డి. రేవంత్ నాయకత్వంలో జీహెచ్ఎంసీ, మల్కాజ్ గిరిలో ఎన్నిసీట్లు గెలిచారో చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసింది. త్వరలో నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసి పార్టీ క్యాడర్ కాపాడుకునేందుకు సన్నద్ధమవుతున్న రాష్ట్ర నాయకత్వానికి ఝలక్ ఇచ్చారు కోమటిరెడ్డి. దీంతో నియోజకవర్గ పర్యటనకు స్టార్ క్యాంపెయినర్ వస్తారా రారా అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. కార్యకర్తలు,నేతలు సైతం కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర అధినాయకత్వం ఎలా స్పందిస్తుందాని వేచి చూసే ధోరణిలో ఉన్నారు.