తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు .మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడితే కేసీఆర్ మోటార్లకు మీటర్ల పెట్టడం ఖాయమని ఆరోపించారు సంజయ్. దమ్ముంటే కేసీఆర్ భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేసి నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మకు అన్నం పెట్టడుగానీ.. పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడట సామెత మాదిరి.. తెలంగాణలో ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే పరిహారం ఇవ్వని కేసీఆర్… పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు పరిహారం ఇవ్వడం ఏంటని సంజయ్ ప్రశ్నించారు.
ఇక విద్యుత్ సంస్థల వద్ద తెలంగాణ ప్రభుత్వం 50 వేల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు సంజయ్.అప్పు తీర్చకపోతే రాష్ట్రంలో డిస్కంలన్నీ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందన్నారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్ అని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, నక్కలగండి, డిండి ప్రాజెక్ట్స్, పెన్షన్స్ ఏమయ్యాయని సంజయ్ ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో గుంట నక్కలు టీఆర్ఎస్, కమ్యూనిస్టు, కాంగ్రెస్ కలిసి పోటిచేస్తాయని ..సింహం సింగిల్ మాదిరి బీజేపీ ఒంటరిగా పోటిచేసి విజయఢంకా మోగిస్తుందని సంజయ్ జోస్యం చెప్పారు.