తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పీసీసీ రేవంత్ తీరుపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ వలన తెలంగాణలో పార్టీ భ్రష్టుపట్టిపోతుందని.. తక్షణమే కమల్ నాథ్ లాంటి నేతలను నియమించాలని కోరారు. అనుభవం లేని నాయకుడికి పీసీసీ పగ్గాలు ఇవ్వడం వలన పార్టీ భ్రష్టుపట్టిపోతుందని .. రేవంత్ తో కలిసి సభను పంచుకునేది లేదని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఆత్మగౌవరం కాపాడుకోవడం కోసమే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లడం లేదని వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్రకు చర్చకు దారితీశాయి.
పార్టీ వీడే ప్రసక్తే లేదు..
ఇక పీసీసీ రేవంత్ పై కోమటిరెడ్డి మరోసారి విమర్శలు వర్షం కురిపించారు. రేవంత్ తీరు పై సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారని .. తన అనుచరులతో అవమానించేలా వ్యాఖ్యలు చేయిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని తనకు గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ హోదాలో ఉండి.. సీనియర్ నేతలను హోంగార్డులతో పోల్చడం రేవంత్ వైఖరికి నిదర్శమన్నారు. కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ఠాగూర్ తో పార్టీకి నష్టం..
కాగా రాష్ట్రంలోని పరిస్థితులపై మాణిక్యం ఠాగూర్ తప్పుడు నివేదికలను అందజేస్తున్నారని వెంకట్ రెడ్డి లేఖలో తెలిపారు. పీసీసీ విషయంలో దొంగనాటకాలు ఆడి పార్టీని సర్వనాశనం చేశారని.. దాని ఫలితమే తెలంగాణలో పార్టీ నాశానమవడానికి కారణమని వెల్లడించారు. తక్షణమే ఠాగూర్ ను తొలగించి. .అతని స్థానంలొ అనుభవమున్న నేతలను నియమించాలని కోరారు.
వెంకట్ రెడ్డి అభిప్రాయం తీసుకుంటాం..
అటు ఢిల్లీలొ కాంగ్రెస్ ముఖ్యనాయకులతో భేటి అయిన రేవంత్.. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించారు. సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాజకీయాలపై చర్చజరిగినట్లు తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి సమయం లేకపోవడం వలన సమావేశానికి రాలేకపోయాడని.. అతని అభిప్రాయాన్ని తీసుకుని మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలిపారు.అంతేకాక వివిధ జిల్లాలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీపై కూడా చర్చ జరిగినట్లు రేవంత్ స్పష్టం చేశారు.
మొత్తంమీద కోమటిరెడ్డి , రేవంత్ రెడ్డి వ్యవహరం కాంగ్రెస్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఉప ఎన్నిక ప్రచారానికి రానని కోమటిరెడ్డి తెగేసి చెప్తుంటే.. ఆయన అభిప్రాయాన్ని తీసుకుని అభ్యర్థి ఖరారు చేస్తామంటూ రేవంత్ మాట్లాడటంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.